పాఠశాలలో ఫుడ్ పాయిజన్... 25 మంది విద్యార్థులకు అస్వస్థత

posted on: Jan 29, 2026 3:34PM

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపుర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. గ్రామంలో నిన్న నిర్వహించిన ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని పాఠశాల సిబ్బంది ఈ రోజు మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించినట్లు తెలుస్తోంది. ఆ ఆహారాన్ని సుమారు 40 మంది విద్యార్థులు భోజనం చేయగా, కొద్దిసేపటికే 25 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపునొప్పి, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలతో విద్యార్థులు ఏడుస్తూ కుప్పకూలడంతో పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే స్పందించి, బాధిత విద్యార్థులను ఆటోల ద్వారా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. విద్యార్థుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు మరియు స్థానిక పరిపాలన యంత్రాంగం రంగంలోకి దిగింది. ఘటనకు కారణమైన ఆహారం నాణ్యతపై విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. 

విద్యార్థులకు మిగిలిన ఆహారాన్ని వడ్డించిన వ్యవహారంపై బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బాధిత విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాఠశాలల్లో భోజన ఏర్పాట్లపై కఠిన పర్యవేక్షణ అవసరమని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...