బొకేల వ్యాపారులకు బ్యాండ్ పడింది!
posted on: Jun 11, 2014 6:24PM

ఎలక్షన్లు అయిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేసేశారు. వారందరికీ అభినందనలే అభినందనలు.. దండలే దండలు.. బొకేలే బొకేలు.. దాంతో తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు దండల మాదిరిగా వర్ధిల్లుతుందని ఆశించిన హైదరాబాద్‌లోని ఫ్లవర్ బొకేల వ్యాపారుల ఆశల మీద రాజకీయ నాయకులు నీళ్ళు చల్లారు. మామూలుగా గతంలో అయితే అయినదానికీ, కానిదానికీ రాజకీయ నాయకుల దగ్గర బొకేల హడావిడి వుండేది. అయితే తాజాగా అటు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకులు, ఇటు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పొదుపు మంత్రాలు పఠిస్తున్నారు. తమ దగ్గరకి వచ్చేవారు బొకేలు, దండలు పట్టుకురావద్దని స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్లో అందరూ పొదుపు చేయాల్సిన అవసరం వుందని, దుబారా ఖర్చు చేయకూడదని అందుకే తాము బొకేలకి, దండలకి దూరంగా వుంటున్నామని చాలామంది రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. తాము దుబారా ఖర్చులని ఎలా అదుపు చేస్తున్నారో బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఏనుగులు వెళ్ళే దారి వదిలేసి, చీమలు వెళ్ళే దారిలో కాపలా పెట్టినట్టు... మిగతా దుబారా ఖర్చులన్నీ యథావిధిగా జరిగిపోతున్నప్పటికీ, బొకేలు, దండల విషయంలోనే రాజకీయ నాయకులు పొదుపు పాటించేస్తూ దేశాన్ని కాపాడేస్తు్న్నారు. రాజకీయ నాయకుల దగ్గరకి వెళ్లేవాళ్ళు కూడా హమ్మయ్య ఖర్చు తగ్గిందనుకుని హ్యాపీగా ఫీలవుతున్నారు. రాజకీయ నాయకుల పొదుపు సంగతేమోగానీ, వీళ్ళను నమ్ముకుని హైదరాబాద్‌లో పూల వ్యాపారాలు పెట్టుకున్నవాళ్ళు మాత్రం నష్టపోతున్నారు. ఈ సీజన్‌లో బొకేలు, దండల వ్యాపారం బాగా వుంటుందని బోలెడు పూలు తెప్పించామని అయితే, రాజకీయ నాయకుల అతి పొదుపు కారణంగా తమకు బ్యాండ్ పడిందని సదరు వ్యాపారులు అంటున్నారు.



.jpg)
.jpg)

.webp)



