నోట్ల రద్దుపై బీజేపీ మాటే నెగ్గింది

posted on: Mar 12, 2017 5:08PM

నోట్ల రద్దుపై విపక్షాలు పార్లమెంటులోనూ...బయటా నానా రచ్చ చేశాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ ఆందోళనకు దిగాయి. నిజానికి జనం కూడా బ్యాంకులు, ఏటీఎంల దగ్గర తీవ్ర ఇక్కట్లు పడ్డారు. తమ డబ్బు తాము తీసుకోవడానికి నరక యాతన అనుభవించారు. నోట్ల రద్దు ఒక ఎత్తయితే... 2 వేల రూపాయలకు చిల్లర దొరక్క కొత్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే విపక్షాలు నోట్ల రద్దునే ఎన్నికల అస్త్రంగా మలచుకున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని రాహుల్ , కేజ్రీవాల్ లాంటి వాళ్లు పిలుపు ఇచ్చారు.

 

బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదని విపక్ష నేతలు అంచనా వేశారు. కానీ వారి లెక్కలు తలకిందులయ్యాయి. నిజానికి ఇటీవల జరిగిన ఏ ఎన్నికలోనూ నోట్ల రద్దు ప్రభావం అస్సలు కనిపించలేదు. నోట్ల రద్దు తర్వాత మెజార్టీ ప్రజలు బీజేపీకే మద్దతుగా నిలిచారు. నోట్ల రద్దు చేసిన మరుసటి నెలలో అంటే డిసెంబరులో చండీగఢ్ పురపాలక సంఘం ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది.

 

ఇటీవల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కమలదళం అనూహ్యంగా దూసుకుపోయింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లోనే దాదాపు ఇదే తరహా ఫలితం వచ్చింది. నోట్ల రద్దుతో పడిన కష్టాలను ప్రజలు పెద్దగా గుర్తు పెట్టుకోలేదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ధనవంతులకు వ్యతిరేకంగా మోడీ పెద్ద నోట్ల రద్దు చేశారన్న ఎన్డీఏ మాటల్ని ఓటర్లు అంగీకరించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డీమోనిటైజేషన్ పేదల కోసమేనంటూ బీజేపీ నేతలు చేసిన ప్రచారం ఆ పార్టీకి సత్ఫలితాన్నిచ్చిందని చెబుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...