Latest News

గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప...మత్స్యకారుడు విలవిల

posted on: Mar 13, 2026 2:32PM

 

ఒంగోలులో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సుబ్రహ్మణ్యం గొంతులో బతికున్న చేప ఇరుక్కుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. సమయానికి వైద్యులు శస్త్రచికిత్స చేసి చేపను తొలగించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఒంగోలుకు చెందిన మత్స్యకారుడు సుబ్రహ్మణ్యం గురువారం చేపల వేటకు వెళ్లాడు. వలలో పడిన చేపలను వేరుచేస్తున్న సమయంలో ఓ చేప ఎగిరి ఆయన నోటిలోకి వెళ్లింది. దాన్ని బయటకు తీసేలోపే చేప గొంతులోకి జారి అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో సుబ్రహ్మణ్యం ఊపిరాడక తీవ్రంగా అల్లాడిపోయాడు.

అతని పరిస్థితిని గమనించిన తోటి మత్స్యకారులు వెంటనే నగరంలోని జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించగా చేప గొంతులో ఇరుక్కుపోయినట్టు గుర్తించారు. వెంటనే ఈఎన్‌టీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసర శస్త్రచికిత్స చేసి చేపను విజయవంతంగా బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...