Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్థిక క్రమశిక్షణ.. జాతీయ సంసిద్ధత.. నెహ్రూ నుంచి మోడీ వరకూ!
posted on: May 18, 2026 3:52PM

అంతర్జాతీయ వేదికపై భౌగోళిక రాజకీయ సమతూకం దెబ్బతిన్నప్పుడు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు.. భారతదేశం తన ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి వినూత్న వ్యూహాలను అవలంబించింది. దేశ భద్రతను, అంతర్గత స్థిరత్వాన్ని కాపాడే క్రమంలో దేశాన్ని పాలించిన వివిధ ప్రభుత్వాలు ప్రజలను భాగస్వాములను చేస్తూ కఠిన నిర్ణయాలు, త్యాగాల వైపు నడిపించడం కద్దు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన విధానాల నుండి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకు దేశం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతిసారీ జాతీయ క్రమశిక్షణను ఒక ఆయుధంగా మలుచుకోవడం చారిత్రక సత్యం. ప్రస్తుత తరుణంలో పశ్చిమ ఆసియాలో నెలకొన్న అస్థిరత, ప్రపంచ ఇంధన మార్కెట్లో వస్తున్న ఒడిదుడుకుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన పొదుపు విజ్ఞప్తి.. దేశ ఆర్థిక చరిత్రలోని పాత రోజులను, అప్పటి కఠిన చట్టాలను మరోసారి గుర్తుచేస్తోంది.
గతాన్ని పరిశీలిస్తే.. రాజకీయాలకు అతీతంగా జాతీయ విపత్తుల సమయంలో పాలకులంతా ప్రజల మద్దతును కూడగట్టారు. దీనిని కేవలం ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితిగా కాకుండా.. దేశ మనుగడకు ప్రతి పౌరుడు నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతగా మార్చారు. ఉదాహరణకు, 1962 నాటి చైనా యుద్ధ సమయంలో దేశ రక్షణ నిధి కోసం ప్రజలు తమ వద్దనున్న బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నాటి ప్రధాని నెహ్రూ కోరారు. ఆ పిలుపునకు స్పందించిన భారత మహిళలు తమ మంగళసూత్రాలను సైతం దేశం కోసం త్యాగం చేసి అసాధారణ దేశభక్తిని చాటారు. అదేవిధంగా, 1965లో పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడటంతో.. వారానికి ఒక పూట భోజనం మానేయాలని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ నినాదం ప్రజల్లో ఒక బలమైన క్రమశిక్షణను నింపింది. ఆ తర్వాతి కాలంలోనూ సంక్షోభాలు దేశ ఆర్థిక వ్యవస్థను పరీక్షించాయి. 1967లో విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడినప్పుడు ఇందిరా గాంధీ ప్రభుత్వం పసిడి కొనుగోళ్లను తగ్గించుకోవాలని కోరారు. అలాగే 2013లో కరెంట్ అకౌంట్ లోటు పెరిగిన తరుణంలో, బంగారం దిగుమతులపై భారం తగ్గించేందుకు కొనుగోళ్లను అదుపులో ఉంచుకోవాలని నాటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు.
ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ఆర్థిక క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత లేదా యుద్ధ వాతావరణం ఏర్పడిన ప్రతిసారీ దేశీయ ఆర్థిక రక్షణ కోసం నాయకులు పౌరుల మద్దతు కోరడం ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ వస్తోంది. దేశ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నియంత్రణ ఉండేది. దీనినే నిపుణులు లైసెన్స్ రాజ్ యుగంగా పిలుస్తారు. ఈ క్రమంలోనే ఇందిరా గాంధీ హయాంలో తీసుకొచ్చిన భారత బంగారు నియంత్రణ చట్టం (1968) ఆభరణాల రంగాన్ని కుదిపేసింది. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడటం, స్మగ్లింగ్‌ను అరికట్టడం దీని ఉద్దేశమైనప్పటికీ.. స్వచ్ఛమైన బంగారు కడ్డీలు, నాణేలను కలిగి ఉండటంపై నిషేధం లాంటి కఠిన నిబంధనలు అమలు చేశారు. ప్రజలు కేవలం ఆభరణాల రూపంలోనే బంగారం ఉంచుకోవాలనే పరిమితులు ఉండటం, స్వర్ణకారులపై ఆంక్షలు విధించడం వల్ల సమాంతరంగా నల్లధనం, అనధికారిక మార్గాలు పెరిగాయి. సుదీర్ఘ వివాదాల తర్వాత ఈ చట్టం 1990లో రద్దయింది.
నాటి రోజుల్లో పౌరుల దైనందిన జీవితంపై కూడా ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండేది. ఒక రేడియో కలిగి ఉండాలన్నా ప్రభుత్వ లైసెన్స్, దానికి రుసుము చెల్లించాల్సి వచ్చేది. కొన్ని ప్రాంతాల్లో సైకిళ్లు, ఎద్దుల బండ్లపై కూడా స్థానిక పన్నులు ఉండేవి. ఒక టెలిఫోన్ కనెక్షన్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇందిరా గాంధీ కాలంలో ఆదాయపు పన్ను రేటు గరిష్టంగా 97 శాతానికి చేరడం, దానికి తోడు సంపద పన్ను తోడవ్వడంతో పెట్టుబడులు నిలిచిపోయి, దేశంలో షాడో ఎకానమీ అంటే నల్లధనం విపరీతంగా పెరిగింది. ఈ విధమైన కొరతలు, విధానపరమైన జాప్యాల కారణంగానే ఇండియా 1991లో చారిత్రాత్మక ఆర్థిక సరళీకరణ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. అయితే.. నాటి నిర్బంధ చట్టాల కాలం ముగిసినప్పటికీ, ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయాలు దేశాన్ని మళ్లీ అప్రమత్తం చేస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చమురు సరఫరా గొలుసులో అడ్డంకులు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు దేశీయంగా ఇంధన ధరలు పెరిగి రూపాయి విలువపై భారం పడుతుంది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు చేసిన విజ్ఞప్తి ఒక సరికొత్త వ్యూహాత్మక మార్గాన్ని చూపిస్తోంది.
గతంలో వలె బలవంతపు ఆంక్షలు విధించకుండా, ప్రస్తుత ప్రభుత్వం పౌరుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కోరుతోంది. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం, అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం ద్వారా దేశ దిగుమతుల బిల్లును తగ్గించి, విదేశీ మారక నిల్వలను సురక్షితం చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు పారదర్శక వృద్ధి యుగంలో, అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా దేశ ఆర్థిక స్థిరత్వాన్ని సంరక్షించుకునే అవకాశం పౌరుల చేతుల్లోనే ఉంది.
భారతదేశ ఆర్థిక ప్రయాణం మనకు నేర్పిన ప్రధాన పాఠం ఏమిటంటే, కాలక్రమేణా సంక్షోభాల రూపాలు మారవచ్చు కానీ దేశ రక్షణకు అవసరమైన ఆర్థిక క్రమశిక్షణ సూత్రం ఎప్పటికీ మారదు. నాటి లైసెన్స్ రాజ్ కాలపు నిర్బంధాల నుండి నేటి స్వచ్ఛంద బాధ్యత యుగం వరకు దేశ ప్రజలు చూపిన సంసిద్ధతే భారతదేశాన్ని ఒక శక్తిమంతమైన దేశంగా నిలిపింది. ప్రస్తుత పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారానే స్వావలంబన కలిగిన సమాజం, దేశ ప్రగతి సాధ్యమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






