Latest News

టోలీచౌకి అగ్నిప్రమాదం.. తెరమీదకు పలు ప్రశ్నలు.. చారిత్రక కట్టడాల భద్రత ప్రశ్నార్థకమేనా?

posted on: Mar 14, 2026 2:48PM

వరుస అగ్నిప్రమాదాలతో హైదరాబాద్ వాసులు గడగడలాడిపోతున్నారు. ఈ ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా చెబుతున్నప్పటికీ వరుసగా జరుగుతున్న ప్రమాదాల వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా అన్న అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ టోలిచౌకి ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చారిత్రక  సెవెన్‌టూంబ్స్ సబ్‌స్టేషన్ పక్కనే ఈ భారీ అగ్నిప్రమాదం జరగడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది.  షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, ఈ ఘటన  రాజకీయంగానూ, భద్రతాపరంగానూ చర్చనీయాంశంగా మారింది. నగరంలో కీలక వాణిజ్య కేంద్రమైన టోలీ చౌకీలో నివాససముదాయాలు, వాణిజ్య సముదాయాలూ పక్కపక్కనే ఉంటాయి. ఇక తాజాగా అగ్నిప్రమాదం సంభవించిన ప్రాంతం సెవెన్ టూంబ్స్ కు అతి సమీపంలో ఉండటం ఆందోళనకు గురి చేసింది.  మంటలు భారీగా ఎగసిపడటంతో  స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, ప్రమాద తీవ్రత తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.  
అన్నిటికీ మించి ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో  ఉన్న  కుతుబ్‌షాహీ సమాధులపై  ప్రభావం చూపిందా అన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.  చారిత్రక కట్టడాలున్న ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో భద్రతా పరమైన లోపాలపై చర్చ మొదలైంది.  

ఇకపోతే ఈ అగ్నిప్రమాదంపై రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.  నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రభుత్వం అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదనీ, అగ్నిమాపక శాఖను బలోపేతం చేసే దిశగా దృష్టి సారించడం లేదనీ విపక్షాలు విమర్శిస్తున్నాయి.  అధికార పార్టీ ప్రమాదంపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టామనీ, బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామనీ భరోసా ఇస్తున్నది.  అయితే ప్రభుత్వ వివరణ పట్ల ప్రతిపక్ష పార్టీలు సంతృప్తి చెందడం లేదు. టోలీ చౌకీ అగ్నప్రమాద స్థలాన్ని పలువురు నాయకులు సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. తమతమ పార్టీల కార్యకర్తలతో బాధితులకు సాయం అందించినట్లు చెప్పారు  

కాగా నగరంలో తరచుగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు  ప్రమాద నిర్వహణ లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యల విషయంలో నిర్లక్ష్యం పతాక స్థాయిలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అగ్నిమాపక సిబ్బందికి అధునాతన పరికరాలు, తగిన శిక్షణ లేకపోవడంతో మంటలను అదుపు చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సెవెన్‌టూంబ్స్  సమీపంలో ఈ అగ్నిప్రమాదం చారిత్రక కుతుబ్‌షాహీ సమాధుల భద్రతపై ఆందోళనలు వ్యక్తం కావడానికి కారణమైంది. పురావస్తు శాఖ  స్పందించి, సమాధుల పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...