Latest News
ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం.. పది మంది రోగులు మృతి
posted on: Mar 16, 2026 9:25AM
.webp)
ఆసుపత్రి ఐసీయూలో సంభవించిన అగ్నిప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన ఒడిశా కటక్ లోని ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల ఎస్‌సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున జరిగింది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ చికిత్స పొందుతున్న వారిలో పది మంది మరణించారు. వారిని రక్షించే క్రమంలో పలువురు ఆస్పత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున రోగులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముఖ్యంగా అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ ఐసీయూలో చికిత్స పొందుతున్న 23 మందిని ఇతర వార్డులకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే 13 మందిని మాత్రమే సురక్షితంగా తరలించగలిగారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఏడుగురు రోగులు మట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మరణించారు. అలాగే తీవ్ర అస్వస్థతకు గురైన మరో ముగ్గురు వేరే వార్డుకు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించారు కాగా రోగులను రక్షించే ప్రయత్నంలో 11 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.



.webp)


