హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం
posted on: Feb 7, 2026 12:15PM
.webp)
హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాంపల్లిలో ఉన్న ఫొరెన్సిక్ ల్యాబ్ భవనం తొలి అంతస్తులోని కంప్యూటర్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. దీంతో ల్యాబ్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కాగా కంప్యూటర్ సెక్షన్ లో జరిగిన ఈ ప్రమాదం కారణంగా విలువైన డెటాకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దట్టంగా పొగ అలుముకోవడంతో లోపలికి ప్రవేశించేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రాష్ట్రంలో కీలకమైన నేర విచారణలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించే కేంద్రం కావడంతో, అగ్నిప్రమాదం నేపథ్యంలో సాక్ష్యాలు, కంప్యూటర్ డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నష్టం ఎంత మేరకు జరిగింది, ఎలాంటి పరికరాలు దగ్ధమయ్యాయన్న అంశాలను పరిశీలిస్తున్నారు.






