ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్టు
posted on Nov 19, 2025 9:08AM

ఆపరేషన్ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాటులో ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఏపీలో 5 జిల్లాలో మకాం వేసిన మావోయిస్టుల కోసం ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఏపీ నడిబొడ్డున పెద్ద సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
విజయవాడలో 28 మంది నక్సల్స్, కాకినాడలో ఇద్దరు, ఏలూరులో 15 మంది, కోనసీమ జిల్లాలో ఒక నక్సలైట్ ను పోలీసులు మంగళవారం (నవంబర్ 18)అరెస్టు చేశారు. మొత్తంగా ఏపీలో మంగళవారం (నవంబర్ 18) ఒక్క రోజే 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ బుధవారం (నవంబర్ 19) కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
విజయవాడలో అరెస్టు చేసిన వారిలో మావోయిస్టు అగ్ర నేత, మంగళవారం (నవంబర్ 18) ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గెరిల్లా టీమ్ కు చెందిన19 మంది, అలాగే ఇప్పటికీ అజ్ణాతంలో ఉన్న మరో మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ భద్రతా సిబ్బంది 9 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఏలూరు గ్రీన్ సిటిలో కూడా 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కాకినాడలో ఇద్దరిని, కోనసీమ జిల్లా అమలాపురంలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా అరెస్టైన 50 మందీ కూడా ఛత్తీస్‌గఢ్ వాసులేనని పోలీసులు తెలిపారు.