ఎఫ్‌సీఆర్ఏ సవరణలు జాతీయ భద్రతకు అవసరమే.. కానీ!?

posted on: Jun 18, 2026 1:12PM

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ)లో సవరణలు భారతదేశంలో పౌర సమాజ స్వేచ్ఛ, జాతీయ భద్రత మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. విదేశీ నిధుల నెట్‌వర్క్‌ల ద్వారా దేశీయ వ్యవహారాల్లో జోక్యాన్ని నిరోధించడం లక్ష్యంగా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇది పౌర హక్కులను పరిమితం చేస్తుందంటూ అమెరికా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా, లేదా లైసెన్స్ రద్దయిన స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓ) విదేశీ నిధులతో కూడిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా నిబంధనలు కఠినతరం  చేశారు.  విదేశీ నిధులు పొందే సంస్థలు నిర్దేశిత శాఖల ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని కేంద్రం నిర్దేశించింది.

ప్రభుత్వం ఈ నిధులను దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు ముప్పుగా భావిస్తూ నిఘాను పెంచింది. అమెరికన్ నెట్‌వర్క్‌ ది టిత్ ఇనిషియేటివ్ లాంటి కొన్ని అంతర్జాతీయ ఫెయిత్-బేస్డ్ సంస్థలు మత మార్పిడులు, రాజకీయ కార్యకలాపాలకు నిధులు మళ్లిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌లపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అమెరికాకు చెందిన  చట్టసభ్యులు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల చట్ట సభ సభ్యులు ఈ సవరణలపై ఆందోళన వ్యక్తం చేశారు. కఠినమైన చట్టాలు, ఆస్తుల స్వాధీనం లాంటి అంశాలు భారతదేశంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న విద్యా, వైద్య, మానవతా సహాయ సంస్థల మనుగడను దెబ్బతీస్తాయని వాదిస్తున్నారు. 

విదేశీ నిధుల పేరుతో వచ్చే అపరిమిత నిధులు దేశ అంతర్గత భద్రతను, పబ్లిక్ ఆర్డర్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున కఠిన నిబంధనలు అవసరమని మన కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది. మరోవైపు విపరీతమైన అధికార కేంద్రీకరణ, ఆస్తుల జప్తు హక్కులు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తాయని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి భారత్‌లో ఎఫ్‌సీఆర్ఏ చట్టం చుట్టూ జరుగుతున్న తాజా పరిణామాలు, కర్ణాటకలో యూఏపీఏ కింద నమోదైన కేసులు, బస్తర్, ఛత్తీస్గఢ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విదేశీ నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణలు, అలాగే వాషింగ్టన్ లో  ఉభయ పక్షాల అమెరికా చట్టసభ సభ్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు  ఇవన్నీ కలిపి పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. 

విదేశీ నిధులు సేవా, విద్యా, మానవతా కార్యక్రమాలకు ఉతమిస్తున్నాయా? లేక జాతీయ భద్రతకు సవాలుగా మారే రహస్య నెట్‌వర్క్‌లకు ఇంధనంలా పనిచేస్తున్నాయా?  అన్న ప్రశ్నలకు  సమాధానం.. ఎఫ్‌సీఆర్ఏ చరిత్ర, న్యాయపరమైన మార్పులు, విదేశీ నిధుల దుర్వినియోగ ఆరోపణలు, అమెరికా, భారత్ రాజకీయ సంబంధాలపై ప్రభావం, పౌర సమాజ స్వేచ్ఛపై పడే భారం.. వంటి వాటిపై ఆధారపడి ఉంది.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 1976లో,  కోల్డ్ వార్  కాలంలో, విదేశీ నిధుల ద్వారా భారత రాజకీయాలు, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలను నియంత్రించాలనే ఉద్దేశ్యంతో రూపొందించారు.  తరువాత 2010లో కొత్త ఎఫ్‌సీఆర్ఏ చట్టం అమల్లోకి వచ్చింది. విదేశీ విరాళాలు స్వీకరించే వ్యక్తులు, సంస్థలు, ఎన్జీఓలు, మత సంస్థలు, విద్యా సంస్థలు వంటి వాటికి  రిజిస్ట్రేషన్/ప్రియర్ పర్మిషన్ వ్యవస్థను అమలు చేసింది. విదేశీ నిధుల్ని భారత సార్వభౌమత్వం, భద్రత, ప్రజా ప్రయోజనం, ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించేలా ఉపయోగించ కూడదని స్పష్టంగా పేర్కొంది. 

2010 తర్వాత ఎఫ్‌సీఆర్ఏ కింద రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించకపోవడం, రద్దు చేయడం, సస్పెండ్ చేయడం వంటి చర్యలు వరుసగా పెరిగాయి. మిషనరీస్ ఆఫ్ చారిటీ వంటి ప్రముఖ సంస్థల ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్‌లపై కూడా వివాదాలు నెలకొని, తాత్కాలికంగా నిలిపివేశారు.  2024 నాటికి జాతీయ భద్రత, పారదర్శకత, నిధుల వినియోగంలో జవాబుదారీతనం పేరుతో, కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్ఏ అమలును మరింత కఠినతరం చేసింది.
2026 మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్, అమెండ్‌మెంట్ బిల్లుతో ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు, సస్పెన్షన్ వంటివి జరిగినప్పుడు,  విదేశీ నిధులతో ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఆస్తులను ఒక నియమిత అధికారి అధీనంలోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఇవ్వాలని ప్రతిపాదించింది.  ప్రియర్ పర్మిషన్ ద్వారా వచ్చిన నిధుల స్వీకరణ, వినియోగానికి కాలపరిమితులు, సస్పెన్షన్ సమయంలో ఆస్తుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ రద్దు వంటి అంశాలపై కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను రూపొందించింది. 

కర్ణాటక పోలీసులు, ఈడీ దర్యాప్తు ఆధారంగా అమెరికాకు చెందిన  ద థిమోతీ ఇనిషియేటివ్  (టీటీఐ) అనే మిషనరీ సంస్థపైనా, ఆరుగురు వ్యక్తులపైనా యూఏపీఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ  క్రమంలో సుమారు   136 కోట్ల విదేశీ నిధులు దేశంలోకి మళ్లించినట్లు ఈడీ  ఆరోపించింది. 1,000కి పైగా విదేశీ డెబిట్ కార్డుల నెట్వర్క్ ద్వారా, భారతదేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల నుండి క్యాష్ డ్రా చేశారనీ.. ముఖ్యంగా బస్తర్, ఛత్తీస్గఢ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గణనీయంగా నగదు లావాదేవీలు నమోదైనట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఎఫ్‌సీఆర్ఏ, ఎఫ్ఈఎంఏ నిబంధనలను ఉల్లంఘిస్తూ విదేశీ నిధులు మత మార్పిడి కార్యకలాపాలకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో లాజిస్టికల్, ఆర్థిక సహాయానికి ఉపయోగినట్లు పేర్కొన్నారు. విదేశీ నిధుల దుర్వినియోగంపై నమోదైన ఈ అతిపెద్ద కేసులో..   న్యాయ సమీక్షకు లోబడి దర్యాప్తు జరుగుతుండటంతో ఇప్పటికీ నిందితలుకు శిక్ష పడలేదు. 

2026 మార్చి 25న ఎఫ్‌సీఆర్ఏ అమెండ్‌మెంట్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు.. ఎన్జీఓ ఆర్గనైజేషన్లను టార్గెట్ చేయవద్దని ప్రతిపక్ష ఎంపీలు బ్యానర్లు ప్రదర్శించి నిరసనలు తెలపడం గమనార్హం.  క్రైస్తవ సంస్థలు, ఎన్జీఓలు, పౌర సంఘాలు సైతం,  ఈ బిల్లును జాతీయ భద్రత పేరుతో మైనారిటీ సంస్థలపై దాడి చేసే సాధనంగా అభివర్ణిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఈ బిల్లు ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడం లేదనీ.. జాతీయ భద్రత, పారదర్శకత కోసం మాత్రమే రూపొందించబడిందని స్పష్టం చేశారు. ఈ ఏడాది మేలో అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో కోల్‌కతాలో పర్యటించారు. మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించారు. అదే సమయంలో, అమెరికా కాంగ్రెస్ సభ్యులు బియో భారత పర్యటనలో ఎఫ్‌సీఆర్ఏ అమెండ్‌మెంట్ బిల్లు అంశాన్ని ప్రస్తావించాలని కోరుతూ, ఈ బిల్లును క్రైస్తవ చారిటీలు, చర్చిలపై ప్రభావం చూపే ప్రమాదకర చర్యగా విమర్శించడం,  ఎఫ్‌సీఆర్ఏ సవరణలపై అమెరికా ఆందోళనకు అద్దం పట్టింది. రిజిస్ట్రేషన్ సస్పెన్షన్, రద్దు  జరిగినప్పుడు, విదేశీ నిధులతో సృష్టించిన ఆస్తుల వెస్టింగ్, నిర్వహణ, విక్రయం కోసం నియమిత అధికారికి అధికారాలు ఇవ్వాలని 2026 బిల్లు ప్రతిపాదించడాన్ని, పౌర సమాజ స్వాతంత్య్రానికి విఘాతంగా విమర్శకులు అభిప్రాయపడ్డారు.

కర్ణాటక కేసులో నేరపూరిత కుట్ర, జాతీయ భద్రతకు హానికరమైన కార్యకలాపాలకు ఆర్థిక, లాజిస్టికల్ సహాయం, విదేశీ నిధుల ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కార్యకలాపాలకు మద్దతు వంటి  తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. అంటే ఎఫ్‌సీఆర్ఏ ఉల్లంఘన జాతీయ భద్రతా నేరంగా కూడా పరిగణిస్తారని స్పష్టమైంది.  విదేశీ నిధుల అక్రమ తరలింపులో భాగం ఫారిన్ డెబిట్ కార్డులతో మన దేశంలో క్యాష్ విత్ డ్రా చేయడం ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎఫ్ఈఎంఏ) ఉల్లంఘనే. ఆ క్రమంలో విదేశీ నిధుల నెట్‌వర్క్‌లపై ఎఫ్‌సీఆర్ఏ, యూఏపీఏ, ఎఫ్ఈఎంఏల సంయుక్త ఆధ్యరంలో నిఘా పెరుగుతోంది.అక్రమాలు జరిగినట్లు తేలితే జాతీయ భద్రతా నేరంగా పరిగణిస్తూ కేసులు పెడుతున్నారు.  ఆ క్రమంలో భారత్–అమెరికా సంబంధాలలో ఎఫ్‌సీఆర్ఏ సవరణలు ఒక సున్నితమైన అంశంగా మారాయి. 

వాస్తవానికి విదేశీ నిధుల దుర్వినియోగం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కార్యకలాపాలు, మత మార్పిడి సంస్థలు  జాతీయ భద్రతపై ఆందోళన పెంచుతున్నాయి.  ఎఫ్‌సీఆర్ఏ, యూఏపీఏ, ఎఫ్ఈఎంఏ చట్టాలతో ఆ దుర్వినియోగాన్ని అరికట్టడం దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరం. అయితే జాతీయ భద్రత పేరుతో సర్వత్రా కఠిన నియంత్రణ అమలు చేస్తే.. నిస్వార్ధ సేవా, విద్యా, మానవతా కార్యక్రమాలు, గ్రామీణ ఆరోగ్య, పేదల సేవా సంస్థలపై ప్రభావం పడే ప్రమాదముంది.  మొత్తమ్మీద జాతీయ భద్రతను కాపాడుకోవాలి; కానీ అదే సమయంలో, పౌర సమాజ స్వేచ్ఛను “కోలాటరల్ డ్యామేజ్”గా త్యాగం చేయకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...