తండ్రిలో ఉండే ఈ అలవాట్లు  పిల్లలను బలహీనులను చేస్తాయ్

posted on: Jul 14, 2026 9:53AM

తండ్రిలో ఉండే ఈ అలవాట్లు  పిల్లలను బలహీనులను చేస్తాయ్

పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు కేవలం వినడం ద్వారానే కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను గమనించడం ద్వారా కూడా నేర్చుకుంటారు.  తండ్రి  రోజువారీ అలవాట్లే  అతని పిల్లల భవిష్యత్తును పాజిటివ్ గా ఉండాలా లేదా నెగిటివ్ గా ఉండాలా అనే విషయం డిసైడ్ చేస్తాయి.  ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.. తండ్రి అలవాట్లు పిల్లలను బలహీనంగా కూడా మారుస్తాయి.  తండ్రిలో ఉండే ఏ అలవాట్లు పిల్లలను బలహీనులను చేస్తాయో  తెలుసుకుంటే..


ప్రతి చిన్న విషయానికి తిట్టడం లేదా కోపగించుకోవడం...

ఎప్పుడూ తిట్టడం లేదా గట్టిగా మాట్లాడటం వల్ల పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సంకోచించవచ్చు. తండ్రి ఇలా ఉండే పిల్లలు తండ్రికి భయపడతారు,  చాలామంది తండ్రి అంటే పిల్లలకు భయం ఉండాలని అనుకుంటారు, కానీ పిల్లలు మనసు విప్పి ఏదైనా మాట్లాడగలిగినప్పుడు, చెప్పగలిగినప్పుడు వారి మనసులో ఉండే ఎన్నో సందేహాలు,  దిగులు భయాలు తొలగిపోతాయి.

ఏం చేయాలి?

పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు ముందు మొత్తం వినాలి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాని గురించి చెప్పేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి,  పిల్లల వ్యక్తిత్వం గురించి కాకుండా, వారి ప్రవర్తన గురించి మాట్లాడాలి.


 పోలిక..


"చూడు, నీ స్నేహితుడు నీకంటే గొప్పవాడు"  చుట్టాలబ్బాయికి నీ కంటే మంచి మార్కులు వచ్చాయి,  ఆ పిల్లాడు నీ కంటే చాలా బెటర్.. ఇలాంటి మాటలు చెప్పడం పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.

ఏం చేయాలి?

పిల్లలను పోల్చకూడదు,  ప్రతి పిల్లవాడిలో విబిన్న ప్రతిభ ఉంటుంది,  పిల్లలలో ఉన్న ప్రతిభ ఏంటో గుర్తించి ప్రోత్సహించాలి. చిన్న ప్రయత్నాలను సైతం అభినందించాలి,  పోల్చకుండా స్ఫూర్తినివ్వాలి.

సమయం కేటాయించకపోవడం..

తీరికలేని  కారణంగా, కొన్నిసార్లు పిల్లలతో గడిపే నాణ్యమైన సమయం  చాలామంది తండ్రులకు  తగ్గిపోతుంది. ఇది ఎంత మాత్రం పిల్లలు భరించలేని విషయం.

ఏం చేయాలి?

ప్రతిరోజూ మొబైల్ కాకుండా  పిల్లలతో కొంత సమయం గడపాలి,  కలిసి ఆడుకోవడం, చదవడం లేదా కబుర్లు చెప్పుకోవడం చేయాలి. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉంటుందో వాటిలో పార్టిసిపేట్ చేయాలి.


మాట తప్పడం..

తండ్రి పదేపదే తన పిల్లలకు ఇచ్చిన మాటను  నెరవేర్చడంలో విఫలమైతే, పిల్లల నమ్మకం బలహీనపడుతుంది.

ఏం చేయాలి?

తండ్రి  నెరవేర్చగల ప్రామిస్ లను మాత్రమే పిల్లలకు చేయాలి. . ప్రణాళికలు మారితే, కారణం వివరించాలి. నిజాయితీకి, నమ్మకానికి ఆదర్శంగా ఉండాలి.


పిల్లల ఎమోషన్స్ పట్టించుకోకపోవడం..

పిల్లలు ఏడుస్తున్నప్పుడు, బాధపడినప్పుడు,  అలిగినప్పుడు వారిని పట్టించుకోవాలి. . లేకపోతే వారు మానసికంగా చాలా దెబ్బతింటారు. తమకు ప్రాముఖ్యత లేదని అనుకుంటారు.

ఏం చేయాలి?

పిల్లల ఎమోషన్స్ ను గుర్తించాలి, వారి బాధను, వారు చెప్పే విషయాలను  ఓపికగా వినాలి. సమస్యకు కలిసి పరిష్కారం కనుగొందామని వారిని ఊరడించాలి.

 
చెడు ప్రవర్తన..

పిల్లలు తరచుగా ఇంట్లో చూసే వాటి నుండే నేర్చుకుంటారు. ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? ఏవి మరచిపోవాలి, ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు.. అందరితో మర్యాదగా ఎలా ఉండాలి?  ఇలాంటి విషయాలు పిల్లలకు వివరించాలి.  సామాజికంగా ఎలా ఉండాలో తెలియజెప్పాలి.

నిర్ణయాలు..

పిల్లలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం ఎప్పుడూ లభించకపోతే, వారి ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడానికి ఆటంకం కలగుతుంది.

ఏం చేయాలి?

వయసుకు తగిన చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి,  నిర్ణయాలు తీసుకునే ముందు ఏం ఆలోచించాలో పిల్లలకు వివరించాలి.


చదువు మాత్రమే కాదు..

మంచి మార్కులు ముఖ్యమే కావచ్చు, కానీ పిల్లల పూర్తిగా అభివృద్ధి  చెందడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి.

ఏం చేయాలి?

క్రీడలు, కళలు , సృజనాత్మక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.  ఫలితాన్ని మాత్రమే కాకుండా, చేసిన ప్రయత్నాన్ని కూడా అభినందించాలి.  నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని పిల్లలకు తెలిజెప్పాలి.


                                       *రూపశ్రీ.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...