సర్పంచ్‌గా పోటీ చేయడానికి సొంత కూతురిని చంపిన తండ్రి

posted on: Feb 2, 2026 4:15PM

 

అధికార వ్యామోహం ఎంతటి అమానుష చర్యలకు దారి తీస్తుందో చూపించే హృదయ విదారక ఘటన మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుల్లో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని కేరూరు గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో ఓ తండ్రి తన సొంత కూతురినే చంపేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం… పాండురంగ అనే వ్యక్తి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్న వారు పోటీకి అర్హులు కాదన్న విషయం తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ఆశలను నెరవేర్చుకోవాలనే దురాశతో పెద్ద కూతురు ప్రాచీని అడ్డుగా భావించిన పాండురంగ, ఆమెను నిజామాబాద్ జిల్లా ఎడపల్లి సమీపంలోని నిజాంసాగర్ కెనాల్‌లో తోసివేసి హత్య చేశాడు.

కాలువలో పడి బాలిక మృతి చెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడు పాండురంగే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధికార ఆశ మనిషిని ఎంతటి క్రూరత్వానికి దిగజార్చుతుందో మరోసారి రుజువైంది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...