బాడీ లాంగ్వేజ్ మారిందహో!

posted on: Feb 1, 2014 12:27PM

 

 

 

హ్యూమన్ సైకాలజీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఏదైనా ఒక విషయంలో ఎలాగైనా గెలిచి తీరాలని నానా తంటాలు పడిన వ్యక్తులు ఆ విషయంలో ఏదైనా ఎదురుదెబ్బ తగిలితే ఏం చేస్తారు? మొట్టమొదట పెద్ద షాకవుతారు. తమ ప్లానంతా రివర్సయిపోయిందే అని కుమిలిపోతారు. కల్లోలానికి గురవుతారు. ఇలా అయిపోయిందేంటి దేవుడా అని ఆవేదనకి గురవుతారు. మామూలు తెలివైన వాళ్ళయితే కుమిలిపోతూ ఓ మూల కూర్చుంటారు. అదే మహా ముదుర్లయితే తమ ఆవేదన ఎంతమాత్రం బయట పడకుండా జాగ్రత్తపడతారు. అసలేం జరగనట్టు  చిరునవ్వులు చిందిస్తారు. అసలు జరిగినదాన్ని తామెంతమాత్రం పట్టించుకోనట్టు, చాలా లైట్‌గా తీసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తారు.  అంతకుముందు కంటే ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. తమ మీద విజయం సాధించిన వాళ్ళతోనే జోకులేస్తూ మాట్లాడతారు.


ప్రస్తుతం రాష్ట్రంలో విభజనవాదుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎంత యాగీ చేసినా అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానాన్ని ఆమోదం పొందనీయకుండా చేయడానికి దేనికైనా రెడీ అన్నట్టుగా వున్న విభజనవాదులు అనూహ్యంగా క్షణాల్లో  తీర్మానం ఆమోదం పొందేసరికి ఒక్కసారిగా షాకయ్యారు. కుమిలిపోయారు. కల్లోలానికి గురయ్యారు. అయితే అదంతా ఒక్క క్షణమే. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి బిల్లుని తిరస్కరిస్తూ ఆమోదించిన తీర్మానం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అసెంబ్లీలో చర్చ ముగిసినందున తామంతా చాలా హ్యాపీగా వున్నట్టు మాట్లాడారు.

చూడండి.. ఎంత ఉల్లాసంగా వున్నామో.. ఎంత ఉత్సాహంగా వున్నామో అన్నట్టుగా పోజులిచ్చారు.  ఆ తర్వాత వివిధ ఛానళ్ళలో జరిగిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న విభజన వాదులు ప్రపంచంలోని ఉత్సాహమంతా తమ దగ్గరే వున్నట్టుగా కనిపించడం కోసం నానా తంటాలూ పడ్డారు. గతంలో ఇలాంటి డిస్కషన్స్ లో కావాలని గొడవలు పెట్టుకుని చెలరేగిపోయే నాయకులు కూడా చిరునవ్వులు చిందిస్తూ, జోకులు వేస్తూ, సమైక్యవాదులని ‘అన్నా... అన్నా’ అని మర్యాదగా, ప్రేమగా పిలుస్తూ భలే ముద్దొచ్చారు. ఒక మాంఛి ఎదురుదెబ్బ తిన్న విభజనవాదుల బాడీ లాంగ్వేజ్ అయితే మార్చుకున్నారు గానీ, నిజానికి మారాల్సింది రాష్ట్రం విడిపోవాలన్న వాళ్ళ మైండ్ మ్యాపింగ్ అని రాజకీయ విశ్లేషకులు, సమైక్యవాదులు అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...