రైతుల ఆత్మహత్యలకి పరిహారం సమంజసమేనా?

posted on: Feb 20, 2015 9:22AM

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ‘రైతు భరోసా యాత్ర’ పేరుతో అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన తన ఐదురోజుల పర్యటనని హిందూపురం నుండి ఈనెల 22వ తేదీన మొదలుపెట్టబోతున్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను ఆయన కలవబోతున్నారు. ఆయన తన ఈ పర్యటన ద్వారా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతుల పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలో రైతుల పరిస్థితికి ఏ మాత్రం భిన్నంగా లేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది.

 

వారి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మంచి ఆలోచనే కానీ ఆ వంకతో ఆయన ప్రజలను ఆకర్షించి తన పార్టీని బలపరుచుకోవాలనుకోవడం, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనుకోవడం మాత్రం మంచి ఆలోచన కాదు. ఆయన తన తండ్రి రాజశేఖరెడ్డి చనిపోయినప్పటి నుండి నిన్న మొన్నటివరకు కూడా ఓదార్పుయాత్రలతో ఇటువంటి ప్రయాత్నాలే చేసారు. కానీ అవేవీ వైకాపాకు అధికారం, ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కించలేకపోయాయి. అయినా నేటికీ ఆయన ఓదార్పునే కోరుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

అయితే ఆయన చేప్పట్టే ఈ ఓదార్పుయాత్రలను చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయినట్లే ఉంది. ఆర్ధిక సమస్యలతో చనిపోయిన రైతు కుటుంబాలకు ఇంతకు ముందు ప్రభుత్వం రూ.1 లక్ష పరిహారం ఇచ్చేది. దానిని ఇప్పుడు రూ.3 లక్షలకి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనివలన తీవ్ర ఆర్ధికసమస్యలతో సతమతమవుతున్న రైతులను ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించే బదులు, ప్రోత్సహించే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్ధిక సహాయంతో కనీసం తమ కుటుంబాలయినా సమస్యల ఊభిలో నుండి బయటపడతాయనే ఆలోచనతో రైతులు ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉంది. కనుక ఇది అంత మంచి ఆలోచన కాదని చెప్పవచ్చును.

 

అయితే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లేదని రైతుల ఖర్మకు రైతులను వదిపెట్టనక్కర లేదు. ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సమస్యలతో బాధలు పడుతున్న రైతులను గుర్తించి వారికి తక్షణ, తాత్కాలిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లయితే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుంది. కానీ రైతులను కాపాడుకొనే బదులు వారు ఆత్మహత్యలు చేసుకొన్న తరువాత నష్టపరిహారం అందించడం మొదలుపెడితే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా తీవ్ర అప్రదిష్ట పాలయిందో అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రదిష్ట పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...