Latest News
హుండీలో నకిలీ నోట్ల కలకలం
posted on: Mar 23, 2026 5:18PM

హైదరాబాద్ నగరంలోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య నకిలీ నోట్లు బయటపడటంతో ఆలయ వర్గాల్లో కలకలం రేగింది. పవిత్ర స్థలంలోనే ఈ తరహా మోసపూరిత చర్యలు వెలుగుచూడడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో సాధారణంగా నిర్వహించే హుండీ లెక్కింపు కార్యక్రమంలో సిబ్బంది నగదును వేరు చేస్తుండగా, కొన్ని అనుమా నాస్పద నోట్లు కనిపించాయి.
అవి మొదట నిజమైన కరెన్సీలా కనిపించినప్పటికీ, జాగ్రత్తగా పరిశీలించగా అవి “Childrens Bank” పేరుతో ఉన్న నకిలీ నోట్లు అని గుర్తించారు. 100, 200, 500 రూపాయల ముద్రణతో ఉన్న ఈ డూప్లి కేట్ నోట్లు అసలు నోట్లతో కలిపి హుండీలో వేసినట్లుగా పూజారులు గుర్తించారు. అది చూసిన ఆలయ సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. విషయం కాస్త బయటకు రావడంతో భక్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేవుడికి సమర్పణగా ఇచ్చే హుండీలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని, భక్తి పేరుతో దుర్వినియోగం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలా నకిలీ నోట్లు వేయడం ద్వారా మోసం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక వర్గాలు కూడా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. పవిత్రతకు ప్రతీకగా భావించే దేవాలయాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఏంటి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “దేవుడి ముందు కూడా నిజాయితీ లేకపోతే, మరెక్కడ ఉంటుంది?” అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ, భవిష్యత్తులో హుండీ లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే సీసీ కెమెరాల పర్యవేక్షణను పెంచడంతో పాటు, నకిలీ నోట్లు గుర్తించే విధానాలను కూడా అమలు చేస్తామని చెప్పారు. భక్తులు హుండీలో సమర్పించే నగదు విషయంలో జాగ్రత్త గా ఉండాలని, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి, భక్తి పేరుతో హుండీలో నకిలీ నోట్లు వేయడం ఆలయ పవిత్రతను దెబ్బతీసే చర్యగా భావించబడుతోంది. ఇప్పుడు తాజాగా ఈ ఘటన భక్తులలో చర్చనీయాంశంగా మారింది.






