శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ కస్టమ్స్ అధికారి మోసం
posted on: Feb 18, 2026 9:07AM

రాజీవ్ గాంధీ అంతర్జా తీయ విమానాశ్రయంలో నకిలీ కస్టమ్స్ అధికారిగా హల్‌చల్ చేసిన ఓ కేటు గాడు ప్రయాణికుడిని మోసం చేసి రూ.70 వేలతో ఉడాయించిన ఉదంతం సంచలనం రేపింది. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి పనిమీద ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ఈ సమయంలో కస్టమ్స్ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి అతడిని పలకరించి పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద కస్టమ్స్‌లో సీజ్ చేసిన ఐఫోన్లు ఉన్నాయని, అవి బయట మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకు ఇప్పి స్తానని నమ్మబలి కాడు. తాను అధికారినని చెప్పడంతో బాధితుడు అతని మాటలను పూర్తిగా నమ్మాడు.అయితే ఫోన్లు తీసుకురావాలంటే ముందుగా నగదు ఇవ్వాలని నిందితుడు చెప్పడంతో బాధితుడు వెంటనే రూ.70 వేలు అతనికి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న అనంతరం ఫీసులోకి వెళ్లి ఫోన్లు తీసుకొస్తానని చెప్పి ఆ నకిలీ అధికారి అక్కడ నుంచి జారుకున్నాడు. ఎంతసేపు ఎదురు చూసినా కూడా అతడు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే ఆర్జీఐఏ అవుట్‌పోస్ట్ పోలీసులను ఆశ్రయించాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎయిర్‌పోర్టు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలిస్తున్నారు. కస్టమ్స్ సిబ్బంది వివరాలు, ఎంట్రీ-ఎగ్జిట్ రికార్డులు సైతం చెక్ చేస్తున్నారు. నిందితుడు కస్టమ్స్ యూనిఫామ్ ఎలా సంపాదించాడు? అతనిపై ఇతర నేరచరిత్ర ఏమైనా ఉందా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారిక గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ నమ్మవద్దని, తక్కువ ధరకే వస్తువులు ఇప్పిస్తామని చెప్పే వారిని విశ్వసిం చవద్దని పోలీసులు సూచిస్తున్నారు. విమానాశ్రయం వంటి హైసెక్యూరిటీ ప్రాంతంలోనే నకిలీ అధికారి మోసం చేయడంపై ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.






