Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విధ్వంసాన్ని జయించిన విశ్వాసం..సోమనాథ క్షేత్ర పునరుద్ధరణ.. డెబ్బై ఐదేళ్ల ప్రస్థానం!
posted on: May 10, 2026 12:46PM

భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో సోమనాథ క్షేత్రానిది ఒక ప్రత్యేకమైన స్థానం. శతాబ్దాల విదేశీ దండయాత్రలు, అంతులేని విధ్వంసాన్ని చవిచూసినా.. ప్రతిసారీ మరింత వైభవంగా పునర్నిర్మించబడిన ఈ ఆలయం తన పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించినట్లుగా.. సోమనాథం కేవలం ఒక నిర్మాణ సముదాయం కాదు, ఇది భారత ఆత్మబలానికి, అజేయ నాగరికతకు సజీవ సాక్ష్యం. శిథిలాల నుండి శక్తివంతమైన ఆధ్యాత్మిక వెలుగుల కేంద్రంగా ఎదిగిన ఈ ప్రస్థానం ప్రతి భారతీయుడికి గర్వకారణం.
చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. క్రీస్తుశకం 1026లో ఘజ్నీ మహమూద్ చేసిన దాడి సోమనాథ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం. గుజరాత్‌లోని ప్రభాస్ పటాన్ తీరాన ఉన్న ఈ సంపన్న క్షేత్రంపై కన్నేసిన ఘజ్నీ.. థార్ ఎడారిని దాటుకుని వచ్చి అమానవీయ విధ్వంసానికి పాల్పడ్డాడు. కేవలం అపారమైన సంపదను దోచుకోవడమే కాకుండా.. హిందూ ధర్మ విశ్వాసాల కేంద్రమైన జ్యోతిర్లింగాన్ని పగులగొట్టి, ఆలయాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ మూడు రోజుల యుద్ధంలో దాదాపు 50 వేల మంది రక్షకులు ప్రాణత్యాగం చేశారు. అయితే.. ఆ దాడి కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు.. ఒక గొప్ప నాగరికత యొక్క మూలాలను దెబ్బతీసే కుట్రగా చరిత్రకారులు అభివర్ణిస్తారు.
స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సోమనాథ పునర్నిర్మాణం అనేది ఒక రాజకీయ, సిద్ధాంత పోరాటంగా మారింది. 1947లో జునాగఢ్ విలీనం తర్వాత అక్కడ పర్యటించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్.. శిథిలాల మధ్య ఉన్న ఆలయాన్ని చూసి చలించిపోయారు. శతాబ్దాల బానిసత్వ చిహ్నాలను చెరిపివేసి, భారత స్వాభిమానాన్ని చాటేలా ఆలయాన్ని నిర్మించాలని ఆయన ప్రతిజ్ఞ చేశారు. కె.ఎం. మున్షీ వంటి నాయకులు ఆయనకు తోడుగా నిలిచారు. అయితే.. ఈ క్రమంలో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో సిద్ధాంతపరమైన భేదాలు తలెత్తాయి. ప్రభుత్వం నేరుగా మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోకూడదని నెహ్రూ భావించగా.. పటేల్ మాత్రం దీనిని సాంస్కృతిక పునరుజ్జీవనంగా చూశారు.
ఈ సిద్ధాంత ఘర్షణ మధ్యే 1951 మే 11న సోమనాథ ఆలయ పునఃప్రతిష్ఠ ఘనంగా జరిగింది. నెహ్రూ అభ్యంతరాలను పక్కనపెట్టి, అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంలో ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయం. ఆయుధాల కన్నా, సామ్రాజ్యాల కన్నా ప్రజల గుండెల్లో ఉండే విశ్వాసమే గొప్పదని డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఉద్ఘాటించారు. సోమనాథం మళ్లీ నిలబడటం అంటే భారత నాగరికత మరణించలేదని ప్రపంచానికి చాటి చెప్పడమేనని స్పష్టం చేశారు. నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రసంగాన్ని ప్రసార మాధ్యమాలు నియంత్రించినా, అది చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసింది.
ఇక ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ ఆలయ గాథను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. దండయాత్రలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారనీ.. భక్తుల హృదయాల్లో వెలిగే సోమనాథం మాత్రం చిరస్థాయిగా నిలిచిందని మోడీ పేర్కొన్నారు. సోమనాథం అనేది గాయాలను గుర్తు చేసుకుంటూనే.. పునరుద్ధరణ శక్తిని చాటే స్మృతి కేంద్రంగా మోడీ అభివర్ణించారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పర్యాటక హంగులు ఈ క్షేత్రానికి మరింత శోభను చేకూరుస్తున్నాయి.
రాబోయే రోజుల్లో సోమనాథం కేవలం భక్తి కేంద్రంగానే కాకుండా.. భారతదేశ చారిత్రక సత్యాలను, పూర్వీకుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించే విజ్ఞాన భాండాగారంగా నిలవనుంది. ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న ఈ శుభ తరుణంలో... భారత సంస్కృతి తన మూలాలను కాపాడుకుంటూనే ఎలా ఆధునిక ప్రపంచంలో దూసుకుపోతోందో ఈ క్షేత్రం నిరూపిస్తోంది. ఎన్నిసార్లు కూల్చినా మళ్లీ అంతే వేగంతో పుంజుకునే ఈ అజేయ శక్తినే సోమనాథ తత్వం అని చెప్పవచ్చు.
సోమనాథ ఆలయ చరిత్ర మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. విధ్వంసం ఎప్పుడూ తాత్కాలికమే.. కానీ నిర్మాణాత్మకమైన సంకల్పం శాశ్వతం. రాజకీయ సిద్ధాంతాలు, కాలమాన పరిస్థితులు మారవచ్చు కానీ.. ఒక జాతి యొక్క ఆత్మబలానికి ప్రతీకలైన ఇలాంటి పుణ్యక్షేత్రాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. శిథిలాల నుండి శోభాయమానంగా వెలుగొందుతున్న సోమనాథం, నవ భారత నిర్మాణంలో కీలకమైన ఆధ్యాత్మిక శక్తిగా భాసిల్లుతోంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా పోర్టల్ https://www.teluguone.comను లైక్ చేయండి. ఫాలో అవ్వండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.





