రూపాయి వ్యాపార వ్యవస్థ విస్తరణ

posted on: May 19, 2026 1:09AM

అంతర్జాతీయ ఆర్థిక యవనికపై దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగుతున్న అమెరికా డాలర్ ఆధిపత్యానికి గట్టి సవాల్ ఎదురవుతోంది. అదీ భారత కరెన్సీ రూపాయి నుంచి. గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లో డాలర్‌కు దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టడంలో భారతదేశంఅమోఘమైన  ప్రగతిని సాధిస్తోంది. సరిహద్దు దేశాలతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలతో అమెరికా కరెన్సీతో సంబంధం లేకుండా  సొంత కరెన్సీ రూపాయి  ద్వారానే వ్యాపార లావాదేవీలు సాగించేలా ఒక బలీయమైన ఆర్థిక చెల్లింపుల వ్యవస్థను భారత్ సక్సెస్ ఫుల్ గా  ముందుకు తీసుకెళ్తోంది. ఈ వ్యూహాత్మక అడుగు వాషింగ్టన్   రాజకీయ, ఆర్థిక పట్టును సడలిస్తూ, భాగస్వామ్య దేశాలకు తక్కువ ఖర్చుతో కూడిన, అత్యంత సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని అందిస్తోంది.  గ్లోబల్ మార్కెట్లో డాలర్ రహిత వ్యాపారానికి పునాది వేయడంలో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలు  (ఎస్ఆర్ విఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల నుంచి దేశీయ ఎగుమతి, దిగుమతిదారులను కాపాడుకోవడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2022లో ప్రవేశపెట్టిన ఈ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు స్విఫ్ట్ ఆంక్షలు విధించిన తరుణంలో ఈ వ్యవస్థ అవసరాన్ని భారత్ గుర్తించింది. 

అప్పట్లో అత్యవసర ప్రత్యామ్నాయంగా మొదలైన ఈ విధానం, నేడు రష్యా, ఇరాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్, మలేషియా, యూఏఈ సహా పలు దేశాలకు విస్తరించడం విశేషం. ప్రస్తుత అంచనాల ప్రకారం.. దాదాపు 47 దేశాలు భారతదేశంతో రూపాయి ఆధారిత వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. లేదూ చర్చలు తుది దశకు చేరుకున్నాయి.  ఆర్థిక పరంగా చూస్తే..  ఈ రూపాయి చెల్లింపుల వల్ల భాగస్వామ్య దేశాలకు భారీ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. సాంప్రదాయ పద్ధతిలో ఒక దేశ కరెన్సీని మొదట డాలర్‌లోకి మార్చి, ఆ తర్వాత అవతలి దేశ కరెన్సీలోకి మార్చాల్సి వచ్చేది. ఈ రెండు విడతల మార్పిడి ప్రక్రియ వల్ల అదనపు ఫీజులు, సమయం వృథా అయ్యేవి. అయితే రూపాయి సెటిల్‌మెంట్ ద్వారా ఈ మధ్యవర్తిత్వం తప్పి, లావాదేవీల నిర్వహణ వ్యయం దాదాపు 40 నుండి 50 శాతం వరకు తగ్గుతోందని బ్యాంకింగ్ రంగా నిపుణులు చెబెతున్నారు. దీనికి తోడు, బహుళ దేశాల కరస్పాండెంట్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ ద్వారా జరిగే డాలర్ చెల్లింపులకు రోజుల తరబడి సమయం పడితే.. ఇండియన్ డిజిటల్ మౌలిక వసతుల ద్వారా ఇవి క్షణాల వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. 

ఇది విదేశీ ఎగుమతిదారులకు కరెన్సీ హెడ్జింగ్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది.  భూభౌగోళిక వ్యూహాల పరంగా కూడా ఈ నూతన ఆర్థిక నిర్మాణం అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల తీవ్రతను నీరుగారుస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా, ఇరాన్ వంటి దేశాలు భారత్‌కు రాయితీ ధరలపై ముడి చమురును విక్రయించి, ఆ నిధులను రూపాయి రూపంలోనే పొందుతున్నాయి. తిరిగి అదే రూపాయలను భారతదేశం నుండి ఇతర వస్తువుల దిగుమతుల కోసం వినియోగిస్తున్నాయి. ఈ పూర్తి చక్రీయ ప్రక్రియ   అమెరికా బ్యాంకింగ్ పరిధి వెలుపలే సాగుతుండటం గమనార్హం. ఒకవేళ వాషింగ్టన్ ఈ లావాదేవీలపై ఆంక్షలు విధించాలనుకుంటే, అది నేరుగా భారత్‌తో సత్సంబంధాలను దెబ్బతీసుకున్నట్లవుతుంది. వ్యూహాత్మకంగా భారత్‌ను దూరం చేసుకోవడం అమెరికాకు సాధ్యం కాదు కాబట్టి..  ఈ వ్యవస్థపై అమెరికా ఆంక్షలు   నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి.  

మరోవైపు, మలేషియా, థాయిలాండ్, కెన్యా, టాంజానియా వంటి ఎలాంటి ఆంక్షలు లేని దేశాలు కూడా కేవలం ఆర్థిక లాభాల కోసమే ఈ వ్యవస్థలో చేరుతుండటంతో, ఇది ఒక సమాంతర ప్రపంచ ఆర్థిక నిశ్శబ్ద విప్లవంగా అవతరిస్తోంది. ఈ పరిణామాలపై చైనా వైఖరి కూడా ఆసక్తికరంగా ఉంది. చైనా తన సొంత కరెన్సీ అయిన యువాన్  అంతర్జాతీయీకరణకు ప్రయత్నిస్తున్నప్పటికీ..  అక్కడి కఠినమైన మూలధన నియంత్రణల వల్ల అది పరిమితంగానే సాగుతోంది. అయితే, గ్లోబల్ మార్కెట్లో డాలర్ ప్రాధాన్యత తగ్గడం తమకు కూడా మేలు చేస్తుందనే ఉద్దేశంత..  బీజింగ్ ఈ రూపాయి చెల్లింపుల వ్యవస్థ విస్తరణను సమర్థిస్తోంది.  ఈ విజయానికి భారతదేశపు గృహసంబంధిత డిజిటల్ చెల్లింపుల విప్లవం యూపీఐ,   బ్లాక్‌చైన్ సాంకేతికత బలమైన వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. 

ప్రస్తుతం మన యూపీఐ నెలకు వీసా మరియు మాస్టర్‌కార్డ్‌ల ఉమ్మడి లావాదేవీల కంటే ఎక్కువ పరిమాణాన్ని ప్రాసెస్ చేస్తోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు రూపాయి భాగస్వామ్య దేశాలకు కూడా రక్షణ మరియు వాణిజ్య అవసరాల కోసం విస్తరిస్తున్నారు. దీనికి అదనంగా, బ్లాక్‌చైన్ ఆధారిత ట్రేడ్ ఫైనాన్స్ నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య పత్రాల నిర్వహణ,  చెల్లింపుల భద్రతను పూర్తిగా భారత సర్వర్ల పరిధిలోనే సురక్షితం చేశారు.  ప్రపంచవ్యాప్తంగా డాలర్ అవశ్యకత క్రమంగా తగ్గడం వల్ల అమెరికా దీర్ఘకాలంలో భారీ ఆర్థిక నష్టాలను చవిచూడక తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా డాలర్ డిమాండ్ పడిపోవడం వల్ల అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడి (ట్రెజరీఈల్డ్స్  రాబోయే కాలంలో ఒకింత  పెరిగే అవకాశం ఉంది.  దీనివల్ల అమెరికా వార్షిక రుణ వడ్డీ చెల్లింపుల భారం వందల బిలియన్లకు పెరగడమే కాకుండా..  అక్కడ గృహ రుణాలు , కార్పొరేట్ రుణాలు,  వినియోగదారుల క్రెడిట్ వడ్డీ రేట్లు భారీగా పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఇండియాకు కూడా ఈ వ్యవస్థ ద్వారా ముంబై, గిఫ్ట్ సిటీ వంటి కేంద్రాలను ప్రాంతీయ ఫైనాన్షియల్ హబ్‌లుగా మార్చే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అయితే రూపాయి ఇంకా పూర్తి కన్వర్టబుల్ కరెన్సీ కాకపోవడం, క్యాపిటల్ అకౌంట్‌పై నియంత్రణలు ఉండటం వంటి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో డాలర్ వ్యవస్థ ఒక్కసారిగా కూలిపోకపోవచ్చు, కానీ రూపాయి వంటి ప్రత్యామ్నాయాల వైపు అంతర్జాతీయ వాణిజ్యం మళ్లడం అనేది డాలర్ మాత్రమే కింగ్  అనే భావన తగ్గిపోతోంది. ఇండియా  నిర్మించిన ఈ నూతన ఆర్థిక సుస్థిరత భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య పటాన్ని మార్చడమే కాకుండా, నవ భారత ఆర్థిక సార్వభౌమాధికారానికి నిదర్శనంగా నిలవనుంది. 

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...