కింద పడ్డా పై చేయి కావాలంటున్న పీసీబీ

posted on: Feb 9, 2026 9:06AM

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరు కింద పడ్డా పై చేయి మాదే కావాలంటున్న చందంగా ఉంది. టి20 ప్రపంచకప్ లో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ బహిష్కరించకుండా ఆడతామంటూ దిగి వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివాద పరిష్కారానికి షరతులు విధిస్తోంది. తమ డిమాండ్లు నెరవేరిస్తే భారత్ తో మ్చాచ్ ఆడతామంటున్నది. అసలు పీసీబీని మ్యాచ్ బహిష్కిరంచకుండా ఆడాలని ఐసీసీ కోరలేదు. బహిష్కరిస్తు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది కూడా. శ్రీలంక క్రికెట్ బోర్డు అయితే.. మ్యాచ్ అడకుంటే తాము ఆర్థికంగా నష్టపోతామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది.

అంతే కానీ మ్యాచ్ ఆడాలన్న విన్నపమేదీ ఎవరి నుంచీ పీసీబీకి రాలేదు. అయినా భారీ జరిమానాకు భయపడి పాకిస్థాన్ ఈ వివాద పరిష్కారం కోసం తనంత తానే ముందుకు వచ్చింది. దిగగలిగినన్ని మెట్లూ దిగేసింది. అయినా కిందపడ్డా పై చేయి మాదే అనిపించుకోవడానికి ఇప్పుడు డిమాండ్లు అంటున్నది.  

లాహోర్ లో ఐసీసీతో జరిగిన సమావేశంలో పీసీబీ..  టోర్నీ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్‌కు  పరిహారం అందించాలనీ, టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ ఆ జట్టుకు పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలని, భవిష్యత్తులో జరగబోయే ఏదైనా ఐసీసీ ఈవెంట్‌కు తమకు ఆతిథ్య హక్కులు కల్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది. 

షెడ్యూల్ మేరకు ఈ నెల‌ 15న పాకిస్థాన్ భారత్‌ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ముందుగా భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్థాన్ ఇప్పుడు ఆడతామంటూ ముందుకు వచ్చింది. అయితే పూర్తిగా లొంగిపోయినట్లు కనిపించకుండా కొద్ది మేరకైన పరువు దక్కించుకున్నట్లు కనిపించాలన్న ఉద్దేశంతో షరతులు అంటూ డిమాండ్లను తెరపైకి తెచ్చింది. క్రికెట్ వర్గాలలో మాత్రం ఐసీసీ పాకిస్థాన్ షరతులను అంగీకరించినా, అంగీకరించకున్నా పాకిస్థాన్ ఆర్థికనష్టాన్ని భరించే స్థితిలో లేదు కనుక బారత్ తో మ్యాచ్ ఆడి తీరుతుందని అంటున్నాయి.

ఇక పాకిస్థాన్ తుది నిర్ణయం ఆ దేశ ప్రధానితో చర్చించిన తరువాత ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీలో పాకిస్థాన్ కు బ్రహ్మాండమైన శుభారంభం ఏమీ రాలేదు. ఆడిన తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై గెలవడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. చచ్చీ చెడీ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...