ఈటలే టార్గెట్.. ఏసీబీ అటాక్స్.. ఉచ్చు బిగిస్తున్నారా..?
posted on: Jul 2, 2021 9:08PM
ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు.. వెనువెంటనే కేసులు.. కేబినెట్ నుంచి బర్తరఫ్.. ఆ తర్వాత ఆక్రమణలపై కమిటీ.. అంతలోనే ఈటల కుమారుడిపైనా భూకబ్జా కేసు.. ఇలా రాజేందర్‌ను కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసింది కేసీఆర్ సర్కారు.. ఆ దాడి నుంచి తట్టుకోలేకే.. ఆయన బీజేపీ రక్షణలో చేరారని అంటారు. ఇక, హుజురాబాద్‌లో ఈటలను ఓడించేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే వాలిపోయింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అంతా ఈటల ఇలాఖాలో మకాం వేసి.. గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. కులాల వారీగా మీటింగులు పెట్టి.. ఈటలను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈటలకు మరింత ఉచ్చి బిగించేలా ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫీసులో ఏసీబీ దాడులు జరిగాయని చెబుతున్నారు.

దశాబ్దాల చరిత్ర.. వందలాది మంది సభ్యులు.. పార్టీలు, కులమతాలకు అతీతంగా సేవ.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అంటే.. చాలామందికి ఏటేటా జరిగే ఎగ్జిబిషన్.. చేపమందు పంపిణీ గ్రౌండ్ గురించి మాత్రమే తెలుసు, ఆ సొసైటీ కింద అనేక ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. పలు జిల్లాల్లో ప్రముఖ కాలేజీలు ఉన్నాయి. ఏటేటా వేలాది మంది విద్యార్థులు చదువుతుంటారు. అనేక వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సొంతంగా నిర్మించుకున్న పెద్ద పెద్ద భవనాల్లో కళాశాలలు నడుస్తున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ టర్నోవర్ కోట్లల్లోనే ఉంటుంది. ఆ సంస్థలకు వందల కోట్ల ఆస్తులున్నాయి. గత ఆరేళ్లుగా ఈటల రాజేందర్ ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఇటీవలే ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాజాగా, ఈటల టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకొని బీజేపీలో చేరడం.. ఈ దశలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరగడం కాకతాళీయం మాత్రం కాకపోవచ్చు అంటున్నారు. అది ఈటల టార్గెట్‌గా జరిగిన ఏసీబీ దాడులేనంటున్నారు.
సొసైటీ లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. దుకాణాల కేటాయింపులు, నిధుల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు జరిగాయని తెలుస్తోంది. ఏదో ఒక ఆరోపణతో ఈటలపై కేసులు నమోదు చేసి.. ఆయనపై మరింత కేసుల ఉచ్చు బిగించేందుకే ఏసీబీ దాడులు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ అధికారులు సోదాలు చేయడంపై సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్ స్పందించారు. సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. సొసైటీ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని.. ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తున్నట్లు చెప్పారు. సొసైటీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఈటల రాజేందర్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 250 మంది సభ్యులు ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ సోదాలు జరగడం ఇదే మొదటిసారి.






