ఈ తాగుబోతుల వల్ల...కుటుంబాలకు కుటుంబాలు బలి
posted on Oct 26, 2025 12:38PM

నాణ్యమైన మద్యమో, నకిలీ మద్యమో.. అర్ధరాత్రి పూట శివశంకర్, ఎర్రిస్వామి వంటి కొందరు ఆకతాయి యువకులు తప్ప తాగి బలాదూర్ తిరగడం వల్ల వారి ప్రాణాల మీదకు రావడం మాత్రమే కాకుండా, కొన్ని కుటుంబాలకు కుటుంబాలు బలై పోయిన దృశ్యం కనిపించింది కర్నూలు ఘటనలో.
వీరిద్దరికీ ఆ రోడ్ల మీద అర్ధరాత్రి పనేంటి? అంత తాగి పల్సర్ వంటి బండి నడపడానికి మనసెలా ఒప్పింది? అయినా ఇలాంటి వాళ్లు రోడ్లపై ఇంతగా తిరుగుతోంటే హైవే నైట్ పెట్రోలింగ్ ఏమైంది? టోల్ గేట్లు పెట్టి కోట్లు దండుకుంటున్న ఏజెన్సీలు ఇలాంటి వాళ్లు హైవేలపై ఇంతటి నేరాలు- ఘోరాలకు పాల్పడుతుంటే.. నిఘా ఎక్కడా? అన్నదొక ప్రశ్నా పరంపరగా మారింది.
మాములుగా ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్ లో ఎవరైతే ప్రమాదానికి కారణమయ్యేలా ట్రాక్ పైకి వచ్చి యాక్సిడెంట్లకు కారకులవుతారో.. వారిదే నేరంగా పరిగణిస్తుంది రైల్వే యాక్ట్. సరిగ్గా అదే రూలు ఇక్కడా వర్తింప చేయాలి. ఈ నేరంలో శివశంకర్ లేకుంటే, అతడి కుటుంబాన్ని బాధ్యులను చేయాలి. ఇక ఎర్రిస్వామికి కూడా పెద్ద ఎత్తున కఠిన శిక్ష వేయాలి.
ఎందుకంటే అతడు మొదట తన స్నేహితుడి పరిస్థితేమిటో చూడకుండా ఎలాగోలా చేసి బండిని పక్కకు లాగి ఉండాలి. ఆ టైంలో తనకు అది వీలు కాని పక్షంలో వెంటనే అటు వైపు వెళ్ల వాహనాలను సిగ్నళ్లు ఇచ్చి ఉండాలి.. ఇక్కడ బైక్ పడి ఉంది.. దయ చేసి దూరంగా వెళ్లండని చేతులు ఊపి ఉండాల్సింది.
దారిన పోయే వాహనదారుల్లో ఎవరో ఒకరు అది చూసి ఆగి బండి పక్కకు తీయడానికి స్కోపుండేది. అతడి నిర్లక్ష్యం కారణంగా కుటుంబాలకు కుటుంబాలు బుగ్గి పాలు అయిపోయాయి.ఏది ఏమైనా హైవే పెట్రోలింగ్ సరిగా లేని విధానికిదో పరాకాష్ట. ఆపై టోల్ గేట్లు డబ్బు దండుకోడానికి తప్ప ఎందుకూ పనికి రావడం లేదని చెప్పడానికిదో నిదర్శనం. మరి మీరేమంటారు???