ఇంధన సంక్షోభం - భారత్‌ ప్రత్యామ్నాయ అన్వేషణలు

posted on: Jun 11, 2026 4:32PM

హార్ముజ్ జలసంధి సంక్షోభం భారత్‌కు అతిపెద్ద ఇంధన సవాలుగా మారింది. చమురు సరఫరాల్లో అంతరాయాలు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్ని అనిశ్చిత పరిస్ధితుల్లో గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, యూఎష్ ఇంధన కంపెనీల సరఫరాలను భారత్ వేగంగా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీర్ఘకాలికంగా పునరుత్పాదక ఇంధన వనరులు, దేశీయ ఉత్పత్తి,  వ్యూహాత్మక భాగస్వామ్యాలే భారత ఇంధన అవసరాల భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. 

భారత్ తన ముడిచమురులో దాదాపు 87శాతం, ఎల్పీజీ అవసరాల్లో 60శాతం వరకు దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సింహభాగం హార్ముజ్ మీదుగా వస్తుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఈ కీలక మార్గంలో రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగి, దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీశాయి. హార్ముజ్ సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గించి, భారత్ తన ఎల్పీజీ దిగుమతుల్లో అమెరికా వాటాను ఏకంగా 55 శాతానికి పైగా పెంచుకుంది. అమెరికా ఇప్పుడు భారతదేశానికి నంబర్ 1 ఎల్పీజీ సప్లయర్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో యూఎస్ ఇంధన కంపెనీలకు భారత్‌తో ఎల్ఎన్‌జీ, చమురు వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రత్యేక ప్రయోజనాలు దక్కే అవకాశముంది. 

ఈ ఇంధన భద్రతా అనిశ్చితిని అధిగమించడానికి, యూఎస్ పాలకులు భారత నాయకత్వం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు బలోపేతమవుతున్నాయి.   మే 2026 నాటికి రోజుకు దాదాపు 4.27 లక్షల బ్యారెల్స్ వెనిజులా క్రూడ్ అయిల్‌ని దిగుమతి చేసుకుని భారత్ అక్కడ రెండవ అతిపెద్ద కస్టమర్‌గా ఎదిగింది.  అయితే వెనిజులా నుంచి దిగుమతులు ప్రత్యామ్నాయంగా కనిపించినా, దాని పై యూఎస్ ఫైనాన్షియల్–లీగల్ కంట్రోల్ కొనసాగుతూనే ఉండటం భారత్‌కు భారంగా మారే అంశమే. గల్ఫ్ ప్రాంతం, రష్యా, ఇప్పుడు వెనిజులా ఇవన్నీ కలిసి భారత ఎనర్జీ సెక్యూరిటీకి .. మల్టీ–సోర్స్‌గా కనిపిస్తున్నా.. ప్రతి సోర్స్ వెనుక జియోపాలిటికల్ రిస్క్ ఉంది.

మారిన పరిణామాలతో ఇరాన్,  రష్యా వంటి సమస్యలతో కూడిన దేశాలపై కాకుండా, యూఎస్, గల్ఫ్, లాటిన్ అమెరికా దేశాలతో బహుళ సరఫరా మార్గాలను భారత్ అభివృద్ధి చేసుకుంటోంది.  మరోదైపు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోంది. బొగ్గు ఆధారిత వ్యవస్థలను కూడా పర్యావరణహిత టెక్నాలజీలుగా మారుస్తూ, స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.  వ్యూహాత్మక చమురు నిల్వ సామర్థ్యాలను పెంచుకుంటూ, దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు చమురు కంపెనీలు అన్వేషణలు ముమ్మరం చేశాయి.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...