పవన్ కళ్యాణ్ రైతులను రెచ్చగొడుతున్నారుట!
posted on Aug 25, 2015 9:37AM
.jpg)
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పెనుమాక గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడిన తరువాత రాష్ట్ర మంత్రులపై విమర్శలు గుప్పించారు. దానిపై రాష్ట్ర మంత్రులు ఆయనపై ప్రతివిమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు కూడా ఆయనపై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్వార్ధం కోసమే రైతుల వద్దకు వెళ్లి వారిని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే 95శాతం భూసమీకరణ జరిగిందని మిగిలిన 3,000ఎకరాల భూమిని కూడా రైతులను ఒప్పించి సేకరిస్తామని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
పవన్ కళ్యాణ్ మొన్న రైతులతో సమావేశమయినప్పుడు తను తెదేపా-బీజేపీలకు మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన్న వాటికి తను బానిసను కానని అన్నారు. బహుశః అందుకే ఇప్పుడు తెదేపా-బీజేపీ నేతలు కూడా ఆయనకీ అంతే ఘాటుగా ధీటుగా జవాబులు చెపుతున్నారు. కానీ వారి వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శల వలన సమస్యలు పరిష్కారం కావనే సంగతి అందరూ గ్రహించి దానికోసం ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. లేకుంటే వారే ప్రజలలో చులకనవుతారు.