Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహిళల బ్యాడ్మింటన్ లో ముగిసిన అద్భుత శకం.. ఆటకు గుడ్ బై చెప్పిన కరోలినా మారిన్
posted on: Mar 27, 2026 11:14AM

మహిళల బ్యాడ్మింటన్ లో అనితర సాధ్యమన్న స్థాయిలో తనదైన ముద్ర వేసిన స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ తన క్రీడా జీవితానికి ముగింపు పలికింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాద్యమ వేదికగా ప్రకటించింది. బ్యాడ్మింటన్ రంగంలో తన అద్భుతమైన ఆటతీరుతో దశాబ్ద కాలానికి పైగా అగ్రస్థానంలో కొనసాగిన స్పెయిన్ దిగ్గజం కరోలినా మారిన్ చివరి సారిగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ లో ఆడింది. అప్పుడు ఆట మధ్యలోనే మోకాలి గాయంతో వైదొలగిన కరోలినా మారిన్ ఆ తరువాత ఇప్పటి వరకూ బ్యాడ్మింటన్ కోర్టులో కనిపించలేదు. అప్పటి నుంచీ వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే తానీ రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చినట్లు ఆ భావోద్వేగ పోస్టులో పేర్కొంది.
బ్యాడ్మింటన్ కు పెద్దగా ఆదరణ లేని స్పెయిన్ నుంచి వచ్చి తన అసాధారణ ఆటతీరుతో బ్యాడ్మింటన్ లో , ఆసియా దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేసిన కరోలినా మారిన్ 2016 రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ పీవీ సింధును ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుంది. తద్వారా మారిన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది. అంతకు ముందు 2015 ఏప్రిల్‌లో తొలిసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును అందుకున్న కరోలినా.. ఆ స్థానంలో దాదాపు వంద వారాల పాటు కొనసాగింది.
ఇక భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు కరోలినా మారిన్ కొరకరాని కొయ్యగా నిలిచింది. పీవీ సింధుతో తన కెరీర్ లో 18 సార్లు ముఖాముఖీ తలపడిన కరోలినా మారిన్ 12 సార్లు విజయం సాధించింది. అలాగే సైనాతో 13 సార్లు ముఖాముఖీ పోరు జరిగితే అందలో ఏడు సార్లు కరోలినా మారిన్ విజయం సాధించింది.
తన రిటైర్మెంట్ ప్రకటనలో కరోలినా మారిన్ గాయాల తీవ్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. వాస్తవానికి వచ్చే నెలలో తప స్వదేశంలో జరిగే యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఆడి కెరీర్‌ను ఘనంగా ముగించాలని భావించాననీ, అయితే అందుకు శరీరం సహకరించలేదనీ పేర్కొంది. కరోలినా మారిన్ రిటైర్మెంట్ తో మహిళల బ్యాడ్మింటన్ లో ఒక అద్భుత శకం ముగిసిందని చెప్పాలి. అయితే ఆమె పోరాట పటిమ భవిష్యత్ తరాలకు పాఠంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.






