ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి
posted on Apr 24, 2025 3:11PM

కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం
భీకర కాల్పులు.. వేల సంఖ్యలో మావోయిస్టులు..
వాయుసేన సహకారంతో భద్రతా దళాల కూంబింగ్
ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ ముక్త ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో గత కొంత కాలంగా భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. కాల్పులు విరమించి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇలా ఉండగా చత్తీస్‌గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో భద్రతా దళాలు మోహరించి మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. అక్కడ దాదాపు 3000 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ గాలింపు జరుగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కర్రెగుట్టలను చుట్టు ముట్టాయి. వాయుసేన కూడా ఈ కూంబింగ్ లో భాగస్వామి అయ్యిందంటేనే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ తో నక్సల్స్ ముక్త భారత్ దిశగా పడుతున్న అడుగులు ముగింపు దశకు వచ్చినట్లే అవుతుందని కూడా అంటున్నారు. కూబింగ్ నిలిపివేయాలి, శాంతి చర్చ లకు పిలవాలి అంటూ మావోయిస్టులు రాసిన లేఖను కేంద్రం పట్టించుకున్న దాఖలాలు కనిపిం చడం లేదు.
వచ్చే ఏడాది మార్చినాటికి నక్సల్స్ ముక్త భారత్ ను చూడాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తున్నది. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో వేల సంఖ్యలో భద్రతా దళాలను రంగంలోకి దింపింది. స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్, సీఆర్ పీఎఫ్, సైన్యం సంయుక్త ఆపరేషన్ కింద ఆపరేషన్ కగార్ సాగుతోంది. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు ఎత్తయిన గుట్టలతో సుమారు 53 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టలను మావోయిస్టులు అత్యంత సేప్టీ జోన్ గా భావిస్తుంటారు. ఆ కారణంగానే అందుకే ఛత్తీస్ గఢ్ లో తమ ఆనుపానులన్నీ భద్రతా దళాలు తెలుసుకుని దాడులు చేస్తుండటంతో మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారు. ఇలా ఇక్కడ మకాం వేసిన వారిలో పార్టీ అగ్రనేతలు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో జవాన్లను మొహరింపజేసి కూంబిగ్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టలకు దారితీసే అన్ని మార్గాలనూ దాదాపుగా చుట్టుముట్టేశారు. మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్టలను వాయిసేన విమానాలు జల్లెడపడుతున్నాయి. కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అంటున్నారు. కర్రెగుట్టలను భద్రతా బలగాలు మోహరించిన నేపథ్యంలో హరగోపాల్ వంటి పౌరహక్కుల సంఘం నేతలు రంగంలోకి దిగి.. శాంతి చర్చల కోసం మావోలు లేఖ రాసిన తరువాత కూడా ఈ తీరులో ఏరివేత కార్యక్రమం కొనసాగించడాన్ని తప్పుపడుతున్నారు. వెంటనే కూంబింగ్ నిలిపివేసి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని కోరుతున్నారు.