Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సముద్ర జలాల నుంచి విద్యుత్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్.!
posted on: Jul 9, 2026 10:01AM

టెక్నాలజీ ఆవిష్కరణల్లో ప్రపంచాన్ని తరచుగా విస్మయానికి గురి చేస్తూ ఉండే జపాన్.. ఇప్పుడు ఇంధన రంగంలో మరో ఆవిష్కరణకు తెరలేపింది. నదులు వచ్చి సముద్రంలో కలిసే ప్రతిసారీ, మంచినీరు, ఉప్పునీరు మిళితమయ్యే క్రమంలో కొంత శక్తి నిశ్శబ్దంగా వృథా అవుతుంటుంది. ఈ సహజ సిద్ధమైన ప్రక్రియను ఎవరూ ఊహించని రీతిలో ఒడిసిపట్టి.. ఏకంగా సముద్రపు ఉప్పునీటి నుండి కరెంట్ తయారు చేసే సరికొత్త సాంకేతికతను జపాన్ శాస్త్రవేత్తలు సక్సస్ ఫుల్ గా ఆవిష్కరించారు. జపాన్‌లోని తీరప్రాంత నగరం ఫుకుయోకాలోని మామిజుపియా డీశాలినేషన్ కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటి ఒస్మోటిక్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి జపాన్ ఇంధన రంగంలో వినూత్న విప్లవానికి నాంది పలికింది. డెన్మార్క్ తర్వాత ప్రపంచంలోనే ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడుస్తున్న రెండో ప్లాంట్ ఇదే కావడం విశేషం. సాధారణంగా నగరాలు వదిలేసే అత్యధిక ఉప్పు సాంద్రత కలిగిన వ్యర్థ నీరు, మురుగునీటి ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని ఉపయోగించి ఈ ప్లాంట్ లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
ఈ విప్లవాత్మక ప్లాంట్ సైన్స్ లోని ఒస్మోసిస్ అంటే ద్రవాభిసరణం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. దీనిని శాస్త్రీయంగా ప్రెజర్ రిటార్డెడ్ ఒస్మోసిస్ అంటారు. ఈ ప్రక్రియలో అత్యధిక ఒత్తిడితో కూడిన ఉప్పునీటి వైపుకు మంచినీరు అత్యంత వేగంగా దూసుకురావడం వల్ల అక్కడ నీటి పరిమాణంతో పాటు ప్రవాహ ఒత్తిడి అనూహ్యంగా పెరుగుతుంది. ఈ తీవ్రమైన నీటి ప్రవాహ ఒత్తిడిని ఉపయోగించి భారీ టర్బైన్లను వేగంగా తిప్పుతారు, ఆ తర్వాత దానికి అనుసంధానించిన జనరేటర్ సహాయంతో కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం ప్రయోగంలో ఎలాంటి సాంప్రదాయ ఇంధనాన్ని వాడకపోవడం, అలాగే పర్యావరణానికి హాని చేసే కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు విడుదల కాకపోవడం విశేషం.
సాధారణ సముద్రపు నీటిలో 3.5 శాతం మాత్రమే ఉప్పు ఉంటే, ఈ డీశాలినేషన్ కేంద్రంలో మంచినీటిని వేరు చేసిన తర్వాత మిగిలే వ్యర్థ నీటిలో ఏకంగా 8 శాతం అత్యధిక ఉప్పు సాంద్రత ఉంటుంది. మరోవైపు మంచినీటి విభాగంలో మురుగునీటి ప్లాంట్ నుంచి సేకరించిన శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. ఈ రెండు రకాల నీళ్ల మధ్య ఉప్పు సాంద్రత తేడా ఎంత ఎక్కువగా ఉంటే, నీటి ప్రవాహ ఒత్తిడి అంత బలంగా మారి అంత ఎక్కువ విద్యుత్ జనరేట్ అవుతుంది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఈ ప్లాంట్ ఏడాదికి ఏకంగా 8 లక్షల 80 వేల కిలోవాట్ అవర్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కరెంట్ దాదాపు 300 జపనీస్ కుటుంబాల వార్షిక గృహ అవసరాలకు సరిపోతుంది.
మనం సాధారణంగా చూసే సౌరశక్తి, పవన విద్యుత్ లాంటి పునరుత్పాదక ఇంధన వనరులకు వాతావరణ పరిస్థితులతో సంబంధం ఉంటుంది. ఎండ లేకపోయినా, గాలి వీచకపోయినా వాటి ఉత్పత్తి నిలిచిపోతుంది. కానీ, జపాన్ కనిపెట్టిన ఈ సరికొత్త పవర్ ప్లాంట్ వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా, ఏకధాటిగా 90 శాతం గరిష్ట సామర్థ్యంతో రోజుకు 24 గంటలూ నిరంతరాయంగా క్లీన్ ఎనర్జీని అందిస్తుంది. ఫిల్టర్లు త్వరగా పూడుకుపోవడం వంటి కొన్ని చిన్న చిన్న సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా నదీ ముఖద్వారాల వద్ద ఈ బ్లూ ఎనర్జీ ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు జపాన్ చేసిన ఈ అద్భుత ప్రయోగం ఒక దిక్సూచిలా నిలుస్తుంది.
japan osmotic power plant, saltwater electricity generation, blue energy technology



.webp)


