Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సోషల్ మీడియా స్క్రీన్లపైనే ఎన్నికల రాజకీయం.. ఓటర్ల మనోభావాలపై సైలెంట్ ప్రభావం
posted on: May 25, 2026 2:54PM

భారతదేశంలో ఎన్నికల ప్రచార శైలి గత కొన్నేళ్లుగా ఊహించని రీతిలో రూపాంతరం చెందింది. ఒకప్పుడు కుల సమీకరణాలు, మతపరమైన అంశాలు, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్, రాజకీయ కూటముల లెక్కల చుట్టూనే తిరిగిన ఎన్నికల రాజకీయం.. ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్ స్క్రీనే ప్రధాన వేదికగా నిలుస్తోంది. నేడు ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు కేవలం కాలక్షేపానికి మాత్రమే పరిమితం కాకుండా, ఓటర్ల ఆలోచనలను శాసించే అత్యంత శక్తిమంతమైన రాజకీయ ఆయుధాలుగా అవతరించాయి.
బహిరంగ సభలకు వచ్చే వేలాది మంది ప్రజల కంటే, సామాజిక మాధ్యమాల్లో నిశ్శబ్దంగా గమనించే కోట్లాది మంది సైలెంట్ ఆడియన్స్ వైపే రాజకీయ పార్టీలు ఇప్పుడు మొగ్గుచూపుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా డిజిటల్ ట్రెండ్స్ దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా దాదాపు 462 మిలియన్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఒక్క ఇన్ స్టాగ్రామ్ ప్లాట్‌ఫార్మ్‌ను ఉపయోగించే వారి సంఖ్యే 360 మిలియన్లకు పైగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా చూస్తే అత్యధిక ఇన్ స్టాగ్రామ్ మార్కెట్ కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలోనే యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు రీల్స్, స్టోరీస్, పొలిటికల్ మీమ్స్, ఇన్ ఫ్లూయెన్సర్ల కంటెంట్‌ను పెద్ద ఎత్తున వాడుకుంటున్నాయి.
తమిళనాడు రాష్ట్రం విషయానికొస్తే, అక్కడ సుమారు 2.1 కోట్ల మంది ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఉండవచ్చని ఒక అంచనా. స్థానిక జనాభా, స్మార్ట్‌ఫోన్ల వాడకం, చౌకగా లభించే ఇంటర్నెట్ డేటాను బట్టి చూస్తే ఈ సంఖ్య అసాధ్యమేమీ కాదు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకే రాష్ట్రంలో వినియోగదారులు ఉండటమంటే, అది పరోక్షంగా ఒక పూర్తి స్థాయి డిజిటల్ ఎన్నికల రణరంగంగా మారిపోయిందని చెప్పవచ్చు. అయితే.. ఇంతటి భారీ డిజిటల్ జనసమూహాన్ని రాజకీయ పార్టీలు ఎలా చేరుకుంటున్నాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడికో లేదా పార్టీ అకౌంట్‌కో కొన్ని లక్షలు లేదా మిలియన్లలో మాత్రమే ఫాలోవర్లు ఉంటారు. కానీ.. ఎన్నికల సమయంలో తమను ఫాలో అవ్వని కోట్లాది మంది నాన్-ఫాలోవర్స్ స్క్రీన్లపై కూడా తమ పొలిటికల్ కంటెంట్ ప్రత్యక్షమయ్యేలా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీనికోసం మైక్రో-టార్గెటెడ్ యాడ్స్, ఇన్ ఫ్లూయెన్సర్ నెట్‌వర్క్స్, క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ప్రమోషన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు.
కేవలం సహజ సిద్ధమైన ఆర్గానిక్ గ్రోత్ ద్వారానే ఇంతటి అసాధారణ రీచ్ సాధ్యం కాదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెరవెనుక ఏవైనా ఓటర్ల డేటాబేస్ లు లీక్ అయ్యాయా.. లేదా ప్రత్యేకంగా సేకరించిన డేటాను వాడుకుంటున్నారా అనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి ఉదంతాలు, మైక్రో-టార్గెటింగ్ చరిత్రను గమనిస్తే ఈ అనుమానాలు మరింత బలపడతాయి. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటేశారు? అనే విషయంతో పాటు మన డేటా ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?' అనేది కూడా అంతే కీలకంగా మారింది. మరోవైపు.. ఇన్ స్టాగ్రామ్ కంటే అత్యంత లోతైన మరియు వ్యక్తిగత ప్రభావాన్ని చూపే మరో వేదిక వాట్సాప్. తమిళనాడు వ్యాప్తంగా సుమారు 5.4 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారని అంచనా. ఇది భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన మెసేజింగ్ యాప్ కావడంతో.. దీని నెట్‌వర్క్ చాలా పటిష్టంగా ఉంది. విభిన్న వర్గాలకు చెందిన ఫ్యామిలీ గ్రూపులు, గ్రామ లేదా కాలనీ గ్రూపులు, కుల సంఘాల గ్రూపులు, పొలిటికల్ కేడర్ గ్రూపుల ద్వారా వాట్సాప్ ఒక సామాజిక, రాజకీయ చైన్ గా మారిపోయింది. ఇక్కడ ప్రచారానికి ఒక ప్రత్యేకమైన గ్రూప్ నెట్‌వర్క్ మోడల్ నడుస్తోంది. ఒక ప్రధాన ఐటీ సెల్ లేదా కేంద్ర బృందం నుంచి ఏకకాలంలో వేలాది గ్రూపులకు పొలిటికల్ సందేశాలు సెండ్ అవుతాయి. ఆయా గ్రూపుల్లోని సభ్యులు ఆ సమాచారాన్ని తమ వ్యక్తిగత, స్నేహితుల, స్థానిక గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా తక్కువ సమయంలో ఒకే సందేశం లక్షలాది మందికి పదేపదే చేరుతూ ఉంటుంది.
వాట్సాప్‌లో వచ్చే ప్రతి పొలిటికల్ ఫార్వర్డ్ ఒక అదృశ్య డిజిటల్ మైక్ లాంటిది. కానీ ఆ మైక్ వెనుక ఉండి మాట్లాడుతోంది ఎవరనేది సామాన్యులకు అస్సలు తెలియదు. ఈ సోషల్ మీడియా ప్రచారంలో 15 నుండి 60 సెకన్ల వ్యవధి ఉండే రీల్స్, షార్ట్ వీడియోలు, స్థానిక భాషల్లో రూపొందించే మీమ్స్ ఓటర్ల మెదళ్లపై బలమైన ముద్ర వేస్తున్నాయి. హాస్యం, వ్యంగ్యం, భావోద్వేగపూరితమైన సంగీతం తో పాటు ఆకట్టుకునే విజువల్స్‌తో కూడిన ఈ కంటెంట్ ఓటర్లను తెలియకుండానే ఒక ప్రత్యేక భావజాలం వైపు నడిపిస్తోంది. సామాన్య ప్రజలు సులభంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున, ఈ సరికొత్త డిజిటల్ ప్రచారాలు ఎన్నికల తుది ఫలితాలను సైతం మార్చేయగలవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ దేశాల ఎన్నికలలో కూడా సోషల్ మీడియా వేదికగా జరిగిన మైక్రో-టార్గెటింగ్, ఫేక్ న్యూస్ ప్రచారం, ఎమోషనల్ పాలిటిక్స్ ఓటర్ల ప్రవర్తనను గణనీయంగా మార్చినట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. మనం ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు మన మనస్సులో మెదిలే ఆలోచనలు చాలావరకు ఇలాంటి ఒక చిన్న మీమ్ లేదా ఒక నిమిషం వీడియో క్లిప్ ద్వారా ప్రభావితమైనవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్రచారాల నియంత్రణ, నైతికతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), షేర్‌చాట్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు అప్పట్లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏ) ద్వారా భారత ఎన్నికల సంఘానికి ఒక స్వచ్ఛంద నైతిక నియమావళిని సమర్పించాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్‌ను తక్షణమే తొలగించడం, పెయిడ్ పొలిటికల్ యాడ్స్ లో పారదర్శకత పాటించడం, పోలింగ్‌కు ముందు ఉండే నిశ్శబ్ద కాలంలో కంటెంట్‌ను నియంత్రించడం, ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఛానల్‌ను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్లాట్‌ఫార్మ్‌లు అంగీకరించాయి. అయినప్పటికీ, వాట్సాప్ వంటి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫార్మ్‌లలోని ప్రైవేట్ గ్రూపుల్లో జరిగే రహస్య ప్రచారాన్ని, ఫేక్ న్యూస్ వ్యాప్తిని పర్యవేక్షించడం, అడ్డుకోవడం ఎన్నికల సంఘానికి ఒక పెద్ద సవాలుగా మారింది. డేటా దుర్వినియోగం, అనుమతి లేని డేటాబేస్ యాక్సెస్ వంటి ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను పీడిస్తున్నాయి. మన దేశంలో కూడా సామాన్య ఓటర్ల వ్యక్తిగత డేటా, ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయనే దానికి స్పష్టమైన సమాధానాలు లేవు. అవి ఏ స్థాయిలో రాజకీయ ప్రచారాల కోసం దుర్వినియోగం అవుతున్నాయనే దానిపై పారదర్శకత అవసరం.
అందుకే ప్రస్తుత తరుణంలో డేటా ప్రొటెక్షన్ లేదా సమాచార రక్షణ చట్టాలు కేవలం కార్పొరేట్ కంపెనీల నియంత్రణకే కాకుండా, ప్రజాస్వామ్య ఉనికిని కాపాడే రక్షణ కవచాలుగా మారాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో కనిపిస్తున్న ఈ డిజిటల్ ట్రెండ్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనది కాదు, ఇది మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ ఫార్వర్డ్ ల ప్రభావం ఇప్పటికే దేశవ్యాప్త రాజకీయ వాస్తవంగా మారిపోయింది. ఈ కొత్త డిజిటల్ యుగంలో మూడు ప్రధాన ప్రశ్నలపై సమాజంలో చర్చ జరగాలి. మొదటిది.. ఒక రాజకీయ శ్రేణి కోట్లాది మందిని ఎంత వేగంగా ప్రభావితం చేయగలుగుతోంది? రెండోది.. ఆ రీచ్ వెనుక సహజమైన ఆదరణ ఉందా లేక డేటాబేస్ ల మాయాజాలం ఉందా? ఇక మూడోది.. ఓటరుకు నిజంగానే సమతుల్యమైన సమాచారం అందుతోందా లేదా కేవలం ఒకే వైపు ఉన్న భావోద్వేగ ప్రచారంతో వారి మనసులను మారుస్తున్నారా? ఎన్నికల భవిష్యత్తు ఇకపై కేవలం బహిరంగ సభలు, గోడ పత్రికలు, టీవీ చర్చల్లో మాత్రమే లేదు, నిశ్శబ్దంగా స్క్రోల్ అవుతున్న స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపైనే నిర్ణయించబడుతోంది. ఈ వాస్తవాన్ని గ్రహించి డేటా రక్షణ, ప్లాట్‌ఫార్మ్ పారదర్శకత మరియు ఓటర్లలో డిజిటల్ అక్షరాస్యతను పెంచే దిశగా కొత్త ప్రజాస్వామ్య చర్చలు ప్రారంభం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.


.webp)


