ఓటర్ కార్డులు.. ఎన్నో అనుమానాలు

 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు త్వరలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఒక ప్రక్రియ, దాని మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలు కలిగిస్తున్నాయి. ప్రతి ఓటరూ తన ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. దీనికి సంబంధించి కొద్ది నెలల క్రితం రంగంలోకి దిగింది. అయితే ప్రభుత్వోద్యోగుల నిర్వాకం పుణ్యమా అని ఆ పని ఆశించిన రీతిలో  జరగలేదు. ఇంటింటికీ తిరిగి ఓటరు కార్డులకు ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాల్సిన సదరు ఉద్యోగులు ఏవో కాకిలెక్కలు రాసేసి ఎలక్షన్ కమిషన్ ముఖాన పారేశారు. వారు ఇచ్చిన కాకి లెక్కల ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే ఎన్నో  లక్షల మంది ఓట్లు గల్లంతు అయిపోయేవి. అయితే ఉద్యోగుల నిర్వాకాన్ని కనిపెట్టిన ఎన్నికల సంఘం ఈ విషయంలో మరోసారి రంగంలోకి దిగింది. త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం వున్న హైదరాబాద్‌లో అన్ని ఓటర్ కార్డులూ ఆధార్ కార్డులతో  అనుసంధానం చేయాలని  ప్రయత్నిస్తోంది. ఆధార్‌తో అనుసంధానం కాని ఓటర్లను తొలగిస్తామని కూడా ఎన్నికల కమిషన్ చెబుతోంది.

అయితే ఎన్నికల కమిషన్‌కి సంబంధించిన ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని మాట్లాడ్డం ఎన్నో అనుమానాలను తావు ఇస్తోంది. హైదరాబాద్‌లో గెలిచి తీరాలన్న ఉద్దేశంలో వున్న కేసీఆర్ తమకు అనుకూలం కాని వారి ఓట్లను రద్దు చేయించడానికే రంగంలోకి దిగారని ఆయనంటే గిట్టని వారు అనుమానపడుతున్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులు టీఆర్ఎస్‌కి ఎలాగూ ఓటు వేయరు కాబట్టి ఓటర్ల రద్దులో ఎక్కువశాతం సీమాంధ్రుల ఓట్లు ఎగిరిపోయే అవకాశాలు వున్నాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్‌ని కేసీఆర్ ప్రభుత్వం ప్రభావితం చేసే అవకాశాలు ఎంతమాత్రాలూ లేవన్న నిజాన్ని పలువురు విస్మరిస్తున్నారు. ఈ నిజం కంటే వారిలోని భయమే వారి మీద పట్టు సాధిస్తోంది. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఈ భయాన్ని తొలగించడానికి ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుంటుందో, కేసీఆర్ చొరవ తీసుకుంటారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu