Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ : మంత్రి అచ్చెన్నాయుడు
posted on: Jul 27, 2026 8:45AM
.webp)
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల లభ్యత, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో ఆదివారం వెబినార్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నైరుతి రుతుపవనాల కాలంలో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా లోటుగా నమోదైందన్నారు. సీజన్ సాధారణ వర్షపాతం 580.1 మి.మీ. కాగా, ప్రస్తుత తేదీ నాటికి సాధారణంగా 225.7 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ఉందని, అయితే కేవలం 104.5 మి.మీ. మాత్రమే నమోదై 53.7 శాతం లోటు ఏర్పడిందని వివరించారు. మొత్తం 28 జిల్లాల్లో 21 జిల్లాలు ‘వర్షపాతం లోటు’ కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. పశ్చిమ గోదావరి, అన్నమయ్య, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు కలిపి ఆరు జిల్లాలు ‘తీవ్ర వర్షపాతం లోటు’ కేటగిరీలో ఉన్నాయని, నెల్లూరు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని చెప్పారు.
మండల స్థాయిలో 249 మండలాలు ‘తీవ్ర వర్షపాతం లోటు’లో, 359 మండలాలు ‘వర్షపాతం లోటు’లో ఉండగా, కేవలం రెండు మండలాల్లో మాత్రమే ‘అత్యధిక వర్షపాతం’ నమోదైందని మంత్రి తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, కోస్తాంధ్ర, రాయలసీమ అనే నాలుగు వ్యవసాయ వాతావరణ మండలాలన్నీ ఇప్పటికీ ‘వర్షపాతం లోటు’ కేటగిరీలోనే కొనసాగుతున్నాయని చెప్పారు. వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా జిల్లాస్థాయి ప్రమాద అంచనాలు, రైతులకు సూచనలు, ప్రత్యామ్నాయ విత్తనాల ప్రణాళిక మరియు దశలవారీ పంటల అత్యవసర ప్రణాళిక చర్యలను ఇప్పటికే ప్రారంభించామని మంత్రి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అంచనా వేసిన 8,489 రైతు సేవా కేంద్రాలు మరియు 688 మండలాల్లో, 1,357 రైతు సేవా కేంద్రాలు, 168 మండలాలు అధిక ప్రమాద స్థాయిలో ఉన్నాయని వివరించారు. ఖరీఫ్–2026 సీజన్‌లో రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.
క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి, రైతులకు అవసరమైన సూచనలు, ప్రత్యామ్నాయ పంటలు, అత్యవసర విత్తనాలు మరియు పంట రక్షణ చర్యలను సకాలంలో అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, డైరెక్టర్ మంజీర్ జిలాని, రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, 28 జిల్లాల డీఏవోలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు
El Nino, Rainfall Deficit, Southwest Monsoon, Crop Protection, Soil Moisture Conservation,
Alternative Crops, Minister Kinjarapu Atchannaidu, CM Chandrababu






