Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిశ్శబ్దంగా రాలిపోతున్న విద్యా కుసుమాలు!
posted on: Apr 23, 2026 3:25PM

భారతదేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు కలల సౌధాలుగా వెలుగొందిన ఈ ప్రతిష్ఠాత్మక విద్యాలయాలు.. నేడు విద్యార్థుల ఆత్మహత్యల వేదికలుగా మారుతున్నాయి. కేవలం అకడమిక్ విజయాలకే ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థుల మానసిక స్థితిని విస్మరించడం వల్ల ఈ పరిస్థితి దాపురిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడచిన దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య భయంకరంగా పెరిగింది.
2011లో సుమారు ఆరు వేల పైచిలుకు ఉన్న ఈ ఆత్మహత్యల సంఖ్య 2023 నాటికి పదమూడు వేల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ నీట్, జేఈఈ, ఐఐటి వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులలో ఈ ఆత్మహత్యలు భారీగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రాజస్థాన్, తెలంగాణ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కేవలం ప్రవేశం పొందే వరకే కాకుండా, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గ్రేడ్లు, ప్లేస్‌మెంట్లు మరియు పబ్లికేషన్ల పేరిట విద్యార్థులను నిరంతరం వేధించే ఒక రకమైన అదృశ్య వలయం ఇక్కడ రాజ్యమేలుతోంది.
విద్యార్థిని ఒక వ్యక్తిగా కాకుండా కేవలం పర్ఫార్మెన్స్ ఇచ్చే యంత్రంగా చూడటం వల్ల వారు ఒంటరితనానికి, అపరాధభావానికి లోనవుతున్నారు.ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థల్లోని పరిశోధక విద్యార్థులు తమ గైడ్‌లపై పూర్తిగా ఆధారపడాల్సి రావడం, అక్కడ నెలకొన్న పక్షపాత ధోరణులు వారిని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల త్యాగాలను తలుచుకుంటూ.. వైఫల్యాన్ని భరించలేక చాలామంది విద్యార్థులు తమ గోడును ఎవరికీ చెప్పుకోలేక పోతున్నారు.
క్యాంపస్‌లలో కౌన్సెలర్ల కొరత, మానసిక ఆరోగ్య సమస్యలను బలహీనతగా చూసే ధోరణి ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. ఈ విపత్కర పరిస్థితుల నుండి విద్యార్థులను కాపాడుకోవడానికి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కేవలం ర్యాంకులు, ప్యాకేజీలనే ప్రామాణికంగా తీసుకోకుండా, విద్యార్థుల మానసిక ధైర్యాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలి. కేంద్ర విద్యాశాఖ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యాసంస్థలో పటిష్టమైన కౌన్సెలింగ్ వ్యవస్థను, సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు ప్రాణాలతో ఉండి తమను తాము నిరూపించుకున్నప్పుడే ఆ విద్యా వ్యవస్థకు నిజమైన విలువ దక్కుతుంది.
- సీతారాం కంఠంనేని






