కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ నివాసంలో ఈడీ సోదాలు.. ఎందుకంటే?

posted on: May 27, 2026 9:42AM

కేరళలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఓటమి పాలై, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) విజయం సాధించిన సంగతి తెలిసిందే. పినరయ్ విజయన్ సీఎం పదవి నుంచి వైదొలగిన  నెల రోజుల లోపే  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్   అధికారులు  ఆయన లక్ష్యంగా విస్తృత సోదాలు చేపట్టారు. బుధవారం (మే 27) తెల్లవారు జామునుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో  10 ప్రాంతాల్లో   సోదాలు  చేపట్టారు.   కేరళ రాజధాని తిరువనంతపురంలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ తిరువనంతపురంలోని నివాసంతో పాటు, మరో మంత్రి నివాసంలో కూడా ఈ సోదాలు చేపట్టారు.  కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్ ) ఆర్థిక అక్రమాలకు సంబంధించి  మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టింది. 

ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ  ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.  గతంలో 2017 లో ఈ రెండు సంస్థల మధ్య సాఫ్ట్‌వేర్,  మార్కెటింగ్ సేవలను అందించేందుకు ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఎలాంటి ఐటీ సేవలు అందించకుండానే ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు సీఎంఆర్ఎల్ నుంచి దాదాపు 1.72 కోట్ల రూపాయల అక్రమ చెల్లింపులు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ ఇంటర్మీడియట్ సెటిల్‌మెంట్ బోర్డ్ 2023 లోనే ఒక నివేదికను వెల్లడించింది.

ఆ తర్వాతి విచారణలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్   దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం..  ఈ అక్రమ చెల్లింపుల మొత్తం ఏకంగా 2.70 కోట్ల రూపాయలకు చేరినట్లు తేలింది. ఈ వ్యవహారంపై కేరళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. ఎటువంటి సేవలు అందించకుండానే ఈ స్థాయి లో నెలవారీ చెల్లింపులు జరగడం వెనుక రాజకీయ పలుకుబడి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టి. వీణతో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్తాతో కలిపి మొత్తం 25 మందిపై   కేసు  నమోదు చేసింది. ఈ చట్టం కింద నేరం నిరూపితమైతే ఆరు నెలల నుండి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, మోసానికి గురైన మొత్తానికి మూడు రెట్లు జరిమానా విధించే అవకాశం ఉంది. కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కి సీఎంఆర్ఎల్ సంస్థలో 13.4 శాతం వాటా ఉండటం వల్ల ప్రభుత్వ నిధులు కూడా ఇందులో దుర్వినియోగం అయ్యాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ కేసును కొట్టివేయాలంటూ సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించిన మరుసటి రోజే ఈడీ అధికారులు రంగంలోకి దిగి ఈ భారీ సోదాలు చేపట్టడం విశేషం.  

google-ad-img
    Related Sigment News
    • Loading...