Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హలాల్ లాభాల’ పేరిట సాగిన మోసంపై ఈడీ ఉక్కుపాదం, నౌహేరా షేక్ అరెస్ట్
posted on: May 26, 2026 2:40PM

హీరా గ్రూప్ రూ. 6,000 కోట్ల భారీ కుంభకోణంభారతదేశ ఆర్థిక నేరాల చరిత్రలోనే అత్యంత విస్మయకరమైన, భారీ పాంజీ కుంభకోణాలలో ఒకటిగా నిలిచింది. హీరా గ్రూప్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మతపరమైన నమ్మకాలను, సాంప్రదాయ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని లక్షలాది మంది సామాన్య పెట్టుబడిదారులను వంచించిన ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, హీరా గ్రూప్ కంపెనీల అధినేత్రి నౌహేరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురుగ్రామ్‌లో వి అదుపులోకి తీసుకున్నారు. సుమారు 6,000 కోట్ రూపాయలకు పైగా విలువైన ఈ బృహత్తర మోసపూరిత స్కీమ్‌లో ఇరుక్కుని దాదాపు 1.7 లక్షల మందికి పై ప్రజలు తమ జీవితకాల కష్టార్జితాన్ని, పొదుపు మొత్తాలను కోల్పోయినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ వేరొక గుర్తింపు పత్రాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన నౌహేరా షేక్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో.. ఈడీ అధికారులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు, కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ సుదీర్ఘమైన ఆర్థిక నేర దర్యాప్తు ప్రక్రియ 2026 ప్రారంభంలో తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీస్ యంత్రాంగాలు హీరా గ్రూప్ అనుబంధ సంస్థలపై బాధితుల నుంచి వచ్చిన వెల్లువలాంటి ఫిర్యాదుల ఆధారంగా అనేక ప్రథమ సమాచార నివేదికలను నమోదు చేశాయి. కేసుల తీవ్రతను, దీని వెనుక ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల నెట్‌వర్క్‌ను గమనించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసును అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవహారంగా స్వీకరించి లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా నిధుల మళ్లింపు, నల్లధనాన్ని మార్పిడి చేయడం, పారదర్శకత లేని పెట్టుబడి విధానాలను అవలంబించడం వంటి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు నౌహేరా షేక్, ఆమె అనుచరులపై నిర్ధారణాత్మక ఆధారాలు లభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘోరమైన మోసపూరిత వ్యూహంలో నిందితులు ఎంచుకున్న మార్గం అత్యంత విచారకరం.
ఇస్లామిక్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం, సమాజంలో అత్యంత పవిత్రంగా భావించే హలాల్ సంపాదన అనే భావనను వీరు తమ స్వార్థ లాభాల కోసం ఒక ప్రచార ఆయుధంగా మార్చుకున్నారు. నిజాయితీతో కూడిన వ్యాపారం, వడ్డీ లేని పెట్టుబడులు, మద్యపానం, జూదం వంటి నిషేధిత వ్యాపారాలకు దూరంగా ఉంటూ కేవలం చట్టబద్ధమైన నైతిక మార్గాల్లో లాభాలు ఆర్జించడమే హలాల్ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే.. నౌహేరా షేక్ ఈ సాంప్రదాయ విశ్వాసాల పట్ల ముస్లిం సమాజానికి ఉన్న సెంటిమెంట్‌ను, మానసిక నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని, తాము అందిస్తున్నది పూర్తిగా షరియా చట్టాలకు లోబడిన పెట్టుబడి అవకాశమని నమ్మబలికారు. హీరా గ్రూప్ సంస్థలు తమ ప్రచారంలో పెట్టుబడిదారులకు ఆకాశమే హద్దుగా అసాధ్యమైన వాగ్దానాలను గుప్పించాయి. సాధారణ ఆర్థిక మార్కెట్లలో ఎక్కడా ఊహించని విధంగా, ఏటా సుమారు 36 శాతం వరకు భారీ రాబడిని అందిస్తామని నమ్మబలికారు. సాధారణంగా పాంజీ స్కీమ్‌లలో అనుసరించే క్లాసికల్ పంప్ అండ్ డంప్ లేదా రోటేషన్ సూత్రాన్ని వీరు ఇక్కడ అమలు చేశారు. స్కీమ్ ప్రారంభంలో చేరిన కొంతమంది పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరేలా క్రమం తప్పకుండా భారీ లాభాలను చెల్లించి.. వారి ద్వారానే మౌత్ పబ్లిసిటీ పొందారు.
ఈ మాయాజాలంలో చిక్కుకున్న లక్షలాది మంది ప్రజలు ఎటువంటి కనీస తనిఖీలు చేయకుండా, గ్రూప్‌పై ఉన్న గుడ్డి నమ్మకంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని, స్థలాలను, పొదుపు నిధులను తీసుకొచ్చి హీరా గ్రూప్‌లో కుమ్మరించారు. తీరా భారీ ఎత్తున వందల కోట్లు జమ అయిన తర్వాత, సంస్థ కొత్త పెట్టుబడుల ప్రవాహం ఆగిపోవడంతో అటు అసలు మొత్తాన్ని గానీ, ఇటు వాగ్దానం చేసిన లాభాలను గానీ వెనక్కి ఇవ్వలేక చేతులెత్తేసింది. ఇలాంటి మతపరమైన ఆర్థిక కుంభకోణాలు సమాజంలో కేవలం ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విద్యాసంస్థలు, సామాజిక సమావేశాలు, ప్రార్థనా మందిరాల పరిసరాల వేదికగా విస్తరిస్తాయనేది బహిరంగ రహస్యం. హలాల్ ఫైనాన్స్ అనే పదాన్ని ఒక ఆకర్షణీయమైన లేబుల్‌గా మాత్రమే వాడుకుంటూ, తెరవెనుక నిధులన్నింటినీ నిజమైన వ్యాపార ప్రాజెక్టులలో పెట్టకుండా రియల్ ఎస్టేట్ లావాదేవీలలోకి, కృత్రిమ అకౌంట్లలోకి, మనీలాండరింగ్ మార్గాల్లోకి మళ్లించారు.
షరియా చట్టం ఆశించే పారదర్శకత, సామాజిక న్యాయం, ఆర్థిక నైతికతలను పూర్తిగా తుంగలో తొక్కి, కేవలం విశ్వాసాన్ని వాణిజ్యీకరించి ఇంతటి దౌర్జన్యానికి పాల్పడటం పట్ల ఇటు చట్టపరమైన సంస్థలే కాకుండా.. అటు మత పెద్దలు కూడా తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ హీరా గ్రూప్ కుంభకోణం ప్రస్తుత తరం పెట్టుబడిదారులకు, పర్యవేక్షక వ్యవస్థలకు అనేక గుణపాఠాలను నేర్పుతోంది. అధిక రాబడి వస్తుందనే ఆశతో గుడ్డిగా వెళ్లే ఏ పెట్టుబడి అయినా ప్రమాదకరమనే విషయాన్ని ప్రజలు గ్రహించాల్సి ఉంది. ఎంతటి మతపరమైన, నైతిక పదజాలంతో ప్రచారం చేసినప్పటికీ, సదరు సంస్థకు రిజర్వ్ బ్యాంక్ లేదా సెబీ వంటి ప్రభుత్వ ఆర్థిక నియంత్రణ సంస్థల నుంచి అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా? వారి గత ఆర్థిక నివేదికల పరిస్థితి ఏమిటనేది పరిశీలించడం అత్యంత ఆవశ్యకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాథమిక జాగ్రత్తలు లోపించడం వల్లే నేడు వేలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చింది. మరోవైపు, దేశంలో ఇస్లామిక్ ఫైనాన్స్, హలాల్ పెట్టుబడుల పేరిట జరుగుతున్న అనధికారిక లావాదేవీలపై ప్రభుత్వ నియంత్రణ సంస్థలు మరింత కఠినమైన నిఘా ఉంచాల్సిన అవసరం ఏర్పడింది.
ఇలాంటి నకిలీ పథకాలకు అడ్డుకట్ట వేసేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు, పారదర్శక హలాల్ సర్టిఫికేషన్ విధానాలు, అలాగే ప్రజలను చైతన్యపరిచే హెచ్చరికా ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేయడం తక్షణ కర్తవ్యం. మతాన్ని పెట్టుబడిగా పెట్టి సామాన్యులను దోచుకునే సంస్థలపై కఠిన చట్టాలు తీసుకురావాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో నౌహేరా షేక్‌ను లోతుగా విచారించి, దేశవ్యాప్తంగా హీరా గ్రూప్‌నకు ఉన్న ఆస్తులను, బినామీ లావాదేవీలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే జప్తు చేసిన చరాస్తి, స్థిరాస్తుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి, న్యాయస్థానం ద్వారా వాటిని వేలం వేసి బాధితులకు నష్టపరిహారం మరియు వారి అసలు నిధులను తిరిగి ఇప్పించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ భారీ స్కామ్ యొక్క తదుపరి విచారణలో మరికొన్ని కీలక విషయాలు, వెనుక ఉన్న పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






