Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నయీమ్ గ్యాంగ్ అక్రమ ఆస్తులపై ఈడీ ఛార్జిషీట్
posted on: Jan 28, 2026 6:10PM

నయీమ్ గ్యాంగ్ అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఈడీ కీలక ముందడుగు వేసింది. గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ఉద్దీన్ మరియు అతని అనుచరులు అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002 కింద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అభియోగ పత్రం దాఖలు చేసింది. హైదరాబాద్ జోనల్ కార్యాలయం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎంఎస్‌జే కోర్టులో ఈ ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను దాఖలు చేయగా, ఈ నెల 21న న్యాయస్థానం కాగ్నిజెన్స్ తీసుకుంది.
ఈ కేసులో పాషం శ్రీనివాస్, హసీనా బేగం, మహమ్మద్ తహేరా బేగం, మహమ్మద్ సలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ సలీం, అహెలా బేగం, సయ్యద్ నిలోఫర్, ఫిర్దౌస్ అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్, హీనా కౌసర్‌లను నిందితులుగా ఈడీ పేర్కొంది. వీరంతా నయీమ్‌ఉద్దీన్ అక్రమ ఆస్తుల సామ్రాజ్యాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని అభియోగ పత్రంలో స్పష్టం చేసింది.
తెలంగాణ పోలీస్ శాఖ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. భూములు, ఇళ్లను బలవంతంగా ఆక్రమించి విక్రయించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అలాగే, 1988 బెనామీ ఆస్తులు మరియు లావాదేవీల నిషేధ చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన చర్యల వివరాలు కూడా ఈడీకి అందాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు మరింత విస్తరించింది.
ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌ఉద్దీన్ తన అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా విలువైన భూములు, ఇళ్లను గుర్తించి, వాటి యజమానులను తీవ్రంగా బెదిరించేవాడని తేలింది. ప్రాణాలకు ముప్పు చూపిస్తూ ఆస్తులను తన అనుచరులు లేదా కుటుంబ సభ్యుల పేర్లపై బలవంతంగా అమ్మకాలు, బదిలీలు చేయించేవారని ఈడీ పేర్కొంది.
యజమానులు అంగీకరించకపోతే వారిని లేదా వారి కుటుంబ సభ్యులను అపహరించి, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించేవారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ బలవంతపు అమ్మకాలకుగానూ అసలు యజమానులకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం ఇవ్వలేదని ఈడీ స్పష్టం చేసింది.ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా సంపాదించిన ఆస్తులను చట్టబద్ధమైనవిగా చూపించేందుకు నయీమ్ గ్యాంగ్ ప్రయత్నించిందని ఈడీ గుర్తించింది. భయాందోళనల మధ్య జీవించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికే ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొందని అభియోగ పత్రంలో పేర్కొంది.
ఈ వ్యవహారంలో నయీమ్‌కు అత్యంత సన్నిహితుడైన పాషం శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాడని ఈడీ తేల్చింది. బెదిరింపుల ద్వారా ఆస్తులు లాక్కోవడం, నయీమ్ కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించడమే అతని ప్రధాన బాధ్యతగా ఉండేదని పేర్కొంది.పీఎంఎల్ఏ కింద జరిగిన దర్యాప్తులో మొత్తం 91 స్థిరాస్తులు నయీమ్ కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లపై బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించబడినట్టు తేలింది. వీటిని నేర ఆదాయంగా గుర్తించిన ఈడీ, పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం వాటిని జప్తు చేయాల్సినవిగా పేర్కొంది.
అయితే, ఈ ఆస్తులు ఇప్పటికే బెనామీ చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ ద్వారా అటాచ్ చేయబడిన నేపథ్యంలో, ఈడీ తిరిగి అటాచ్ చేయలేదు. అయినప్పటికీ, కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఈ ఆస్తులను కేంద్ర ప్రభుత్వానికి కన్ఫిస్కేట్ చేయాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. నయీమ్ గ్యాంగ్ అక్రమ ఆస్తులపై ఈడీ వేసిన ఈ అభియోగ పత్రం, రాష్ట్రంలో గ్యాంగ్ నేరాలు, మనీలాండరింగ్, అక్రమ ఆస్తులపై కొనసాగుతున్న దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు.



.webp)


