వందల కోట్లు జప్తయినా చలించని ఒకే ఒక్కడు?

 

 తెదేపా నేతలు పదేపదే తను లక్షకోట్లు ఆస్తులు పోగేసానని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఒకవేళ వారు అంత మొత్తం కనుగొనగలిగితే అందులో ఒక పది శాతం తనకు ఇచ్చి మిగిలినదంతా వారే తీసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి నిన్న సవాలు విసిరారు. వారు ఈ అసత్య ప్రచారాన్ని ఇప్పటికయినా ఆపకపోతే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా.

 

కానీ ఆయన ఆ సవాలు విసిరిన మరునాడే అంటే మంగళవారం నాడు జగన్ మరియు అతని భాగస్వామికి చెందిన రూ. 863 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ ద్రువీకరించడమే కాకుండా అది సరయిన చర్యేనని తీర్పు చెప్పింది. ఈ ఆస్తులలో జగతి పబ్లికేషన్స్ చెందిన షేర్లు, ఫ్లాంట్స్, మిషనరీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లూ అన్నీ కలుపుకొని మొత్తం రూ.369.59 కోట్లు వరకు ఉన్నాయి. ఇవికాక జగన్ కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నఇతర సంస్థలకు చెందిన రూ.494 కోట్ల ఆస్తులను కూడా గత ఏడాదిన్నర కాలంలో ఈడీ జప్తు చేసింది. అంతా కలుపుకొంటే రూ. 863 కోట్ల విలువయిన ఆస్తులను ఈడీ జప్తు చేసిందని స్వయంగా ఈడీ న్యాయ ప్రాధికార సంస్థే స్వయంగా ద్రువీకరించింది.

 

2011 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 445కోట్లుగా పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో అవి రూ.416 కోట్లు అని పేర్కొన్నారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఆయన ప్రకటించిన తాజా ఆస్తుల విలువతో కలిపి చూసుకొన్నట్లయితే రూ.1279 కోట్లని తేలుతోంది. ఎన్నికల అఫిడవిట్ లో జగన్ చూపని ఆస్తుల విలువ ఎంతో ఎవరికీ తెలియదు.

 

ఈడీ రూ. 863 కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం పోవడం గమనిస్తే ఈడీ జప్తు చేసిన ఆస్తులు సముద్రంలో నీటి బిందువంత అని అర్ధమవుతోంది. వెనుక ఇంకా అంతకు పదింతల ఆస్తులు ఉంటే తప్ప ఇన్ని వందల కోట్ల ఆస్తులను పోగొట్టుకొన్న వారెవరూ తట్టుకోలేరు. జగన్మోహన్ రెడ్డిలా నిశ్చింతగా వ్యాపారాలు, రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేయలేరు. మరి అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని తెదేపా నేతలు తనను విమర్శిస్తే మళ్ళీ వారికి సవాళ్లు విసరడం, పరువు నష్టం దావా వేస్తానని బెదిరించడం దేనికో అర్ధం కాదు.