Latest News
‘దేశం’ తూర్పున భాస్కరుడు ఉదయిస్తాడా?
posted on: Oct 6, 2014 5:34PM
.jpg)
తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఇది మామూలే.. కానీ తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో గతంలో ఒకసారి అస్తమించి, మళ్ళీ ఇంకోసారి ఉదయించడానికి ఓ భాస్కరుడు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక సమయంలో పార్టీకి జెల్లకొట్టి వెళ్ళిపోయిన ఆ పెద్దాయన, ఇప్పుడు మళ్ళీ పుట్టింటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఆ పెద్దాయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్. తెలుగుదేశం పార్టీకి ‘బొడ్డు’ కోసి పేరు పెట్టినప్పటి నుంచీ పార్టీలో వున్న నాయకుడు. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని తూర్పు గోదావరి జిల్లాలో తన హవా నడిపిన నాయకుడు. రాష్ట్ర స్థాయిలో ఎన్టీ రామారావు ఏ స్థాయిలో వెలిగారో తూర్పు గోదావరి జిల్లాలో క్యాబినెట్ ర్యాంక్ పదవితో రాష్ట్ర స్థాయిలో కూడా వెలుగు వెలిగిన నాయకుడు. అయినప్పటికీ కీలక సమయంలో పార్టీకి జెల్ల కొట్టి అవినీతి పునాదుల మీద కట్టిన ఓ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పార్టీ తూర్పు తిరిగి దణ్ణం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ వుండటంతో మళ్ళీ ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు ప్రారంభించాడు.
తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పార్టీని, పార్టీ నాయకుడిని ఇష్టమొచ్చినట్టు విమర్శించిన సదరు నాయకుడు తాను తిట్టిన తిట్లన్నీ మర్చిపోయి మళ్ళీ తెలుగుదేశం గడప తొక్కాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే సదరు నాయకుడి పునరాగమన ప్రయత్నాలను స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన నాయకులలో మొదటి వరుసలో నిలిచే ఆ వ్యక్తిని తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోరాదని స్పష్టంగా చెబుతూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనగారు మాత్రం తన ప్రయత్నాలను మాత్రం మానుకోవడం లేదు. ‘‘నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాలి. దానికోసం ఎంత ఖర్చయినా పర్లేదు’’ అని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఈ బృహత్ కార్యాన్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీలో కాస్త లెక్కా డొక్కా తెలిసిన కీలక నాయకుడిని సదరు ‘తూర్పు భాస్కరుడు’ ఆశ్రయించినట్టు తెలుస్తోంది. మరి తెలుగుదేశం అధినేత స్థానిక కార్యకర్తల నిరసనలను పట్టించుకుంటారో లేదో చూడాలి.


.png)
.jpg)


