ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసుకొన్న తెలంగాణ

 

ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ పై ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 58:42 నిష్పత్తిలో విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్స్ మెంట్ భరిద్దామని చేసిన ప్రతిపాదనను తెలంగాణా ప్రభుత్వం నిరాకరించింది. అంతే కాక తెలంగాణా ప్రభుత్వం తమకోసం ప్రత్యేకంగా ఒక ఉన్నత విద్యామండలిని కూడా ఏర్పాటు చేసుకోవడంతో ఇక ఈ సమస్యపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లయింది. ఇక ఎల్లుండి ఈ కేసును విచారణకు చెప్పట్టనున్నసుప్రీం కోర్టే ఈ సమస్యకు పరిష్కారం చూపవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు చూసిన తరువాత అవసరమయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి లేఖలు వ్రాయాలని భావిస్తున్నారు. ఆయన ఈరోజు తనను కలిసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకి కూడా తెలంగాణా ప్రభుత్వంపై పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబును కలిసిన తరువాత కేసీఆర్ ను కూడా కలిసిన వెంకయ్యనాయుడు ఈ విషయం గురించి ఆయనతో కూడా చర్చించి ఉండవచ్చును. కానీ, కేసీఆర్ మరియు ఆయన మంత్రుల మాటలను బట్టి వారు ఈ విషయంలో రాజీపడే అవకాశం ఉండదని స్పష్టమవుతోంది. అందువలన ఇక సుప్రీం కోర్టు ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించుకోవచ్చునేమో కానీ హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల జిల్లాలలో స్థిరపడిన ఆంద్రప్రజల పిల్లల విషయంలో రెండు ప్రభుత్వాలు తప్పనిసరిగా సహకరించుకోవలసి ఉంటుంది. ఒకవేళ కోర్టు కూడా చంద్రబాబు ప్రతిపాదనను సమర్ధిస్తే అప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఏమి చేస్తుందనేది ఆసక్తికరమయిన విషయమే.