నిర్మలమ్మ పద్దు...ఏది తగ్గు ఏది హెచ్చు?
posted on: Feb 1, 2026 4:30PM
.webp)
ఫిబ్రవరి ఒకటి మాఘ పౌర్ణమి అనే ఒకానొక పవిత్రమైన రోజున రికార్డు స్థాయిలో నాన్ స్టాప్ గా తొమ్మిదో ఏట కూడా భారత బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. సంప్రదాయ చీరకట్టులో ఆమె ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎంత కామన్ మేన్ ఫ్రెండ్లీ? అన్నది చూస్తే..ప్రభుత్వం కొన్ని కీలక రంగాలలో కస్టమ్స్ డ్యూటీ అంటే దిగుమతి సుంకం మార్పులు చేయడం వల్ల కొన్ని వస్తువల రేట్లు బాగా తగ్గాయి. అవేంటని పరిశీలిస్తే..
మొబైల్ ఫోన్ల విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల స్మార్ట్‌ఫోన్లు, ఛార్జర్లు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని సవరించడం వల్ల బంగారం, వెండి ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. లిథియం- అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఈవీ కార్లు, బైక్‌ల ధరలు సైతం తగ్గవచ్చు. ఎక్స్-రే మిషన్లు, ఇతర కీలక వైద్య పరికరాల విడిభాగాలపై సుంకం తగ్గింపు వల్ల వైద్య సేవలు కొంచెం చౌకలోనే లభించవచ్చు.
చేనేత ఉత్పత్తుల విషయానికి వస్తే.. ముడి పట్టు, కొన్ని రకాల నూలుపై పన్ను రాయితీలు ఇచ్చారు. కారణం చేనేత కళాకారులను ప్రోత్సహించడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. ఇక ధరలు పెరిగే అవకాశమున్న వాటిలో టాప్ మోస్ట్ ఏవున్నాయో గమనిస్తే.. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, ప్రతి బడ్జెట్‌లో లాగానే ఈసారి కూడా పొగాకు ఉత్పత్తులపై నేషనల్ క్యాలమిటీ కాంటింజెంట్ డ్యూటీ-NCCDని పెంచారు. ఫలితంగా సిగరెట్ల ధరలు తప్పనిసరిగా పెరిగే జాబితాలోకి ఇది వరకే చేరిపోయాయి.
దిగుమతి చేసుకునే లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగానే పెరుగుతాయి. విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకునే కార్లు, మోటారు సైకిళ్లపై పన్ను పెంచారు. ఇంకా లోతుగా వెళ్లి పరిశీలిస్తే.. ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్లు వంటి ధనవంతులు వాడే విమాన ప్రయాణ సాధనాలపైనా సుంకం పెరిగింది.
విదేశాల నుండి వచ్చే ప్లాస్టిక్, రసాయన ఉత్పత్తులపై దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి పన్నులు పెంచారు. కిచెన్ చిమ్నీల దిగుమతిపై పన్ను పెరగడం వల్ల వీటి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. వస్తువుల ధరల కంటే సామాన్యులకు ఉపశమనం కలిగించేలా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లలో మార్పులు చేయడం వల్ల వచ్చిన ఆదాయంలో కొంత ఆదా చేసుకునే వెసలుబాటు కలుగుతోంది.



.webp)
.webp)

.webp)


