Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డంబ్ బాంబులు.. ఇప్పుడు స్మార్ట్ అస్త్రాలు!
posted on: May 11, 2026 4:38PM

ఇండియా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా మరో భారీ విజయాన్ని అందుకుంది. శత్రువుల స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే అత్యాధునిక స్టాండ్-ఆఫ్ ఆయుధ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసి, విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన టీఏఆర్ఏ ( టెక్నికల్లీ అడ్వాన్స్ డ్ రేంజ్ ఆగ్యుమెంటేషన్ ) అంటే సాంకేతికంగా అధునాతన శ్రేణి విస్తరణ. ఈ గ్లైడ్ కిట్ ప్రయోగం విజయవంతం కావడంతో, భారత అమ్ములపొదిలోకి మరో అద్భుతమైన అస్త్రం చేరింది. ఈ విజయంతో అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ గర్వంగా నిలిచింది. ఒడిశా తీరంలో భారత వైమానిక దళం సహకారంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) ఈ సాంకేతికతను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. గాలిలో నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టే సామర్థ్యాన్ని ఈ టీఏఆర్ఏ వ్యవస్థ నిరూపించుకుంది. ఇది కేవలం అధునాతన ఆయుధం మాత్రమే కాదు.. సైన్యం వద్ద ఇప్పటికే ఉన్న వేలాది పాత బాంబులకు అత్యాధునిక మార్గదర్శక వ్యవస్థను, రెక్కలను అమర్చి వాటిని అత్యంత శక్తివంతమైన స్మార్ట్ బాంబులు గా మార్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం.
సాధారణంగా విమానాల నుంచి ప్రయోగించే 'డంబ్ బాంబులకు' ఎటువంటి మార్గదర్శక వ్యవస్థ ఉండదు. అవి కేవలం గురుత్వాకర్షణ శక్తితో కిందకు పడతాయి కాబట్టి లక్ష్యాన్ని చేరడంలో కచ్చితత్వం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ' టిఏఆర్ఏ గ్లైడ్ కిట్ అమర్చడం ద్వారా ఈ బాంబులు స్మార్ట్‌గా మారుతాయి. ఈ కిట్‌లో ఉండే ఫోల్డెడ్ వింగ్స్ బాంబుకు గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించే శక్తి ఇస్తాయి. అలాగే.. ఇందులోని జీపీఎస్, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్) బాంబును లక్ష్యం వైపు సరైన దిశలో నడిపిస్తాయి. దీనివల్ల గురి తప్పే అవకాశం ఉండదు. వ్యూహాత్మకంగా చూస్తే, టీఏఆర్ఏ వ్యవస్థ భారత వైమానిక దళానికి ఎంతో మేలు చేస్తుంది. యుద్ధ సమయంలో పైలట్ల భద్రతకు ఇది భరోసాగా నిలుస్తుంది. స్టాండ్-ఆఫ్ రేంజ్ కారణంగా.. పైలట్లు శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థ పరిధిలోకి వెళ్లకుండానే.. సురక్షితమైన దూరం నుండి బాంబులను ప్రయోగించవచ్చు. ఇది పైలట్ల ప్రాణాలకు, ఖరీదైన యుద్ధ విమానాలకు రక్షణ కల్పిస్తుంది. అలాగే.. కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త క్షిపణులు కొనాల్సిన అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతోనే పాత బాంబులను అధునాతన ఆయుధాలుగా మార్చుకోవడం వల్ల రక్షణ బడ్జెట్ భారం తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా ఆశయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ఇది బలపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాల వద్ద మాత్రమే ఇటువంటి సాంకేతికత అందుబాటులో ఉంది. ఇప్పుడు టీఏఆర్ఏ అభివృద్ధితో భారత్ కూడా ఈ ఎలైట్ గ్రూప్‌లో చేరింది. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌లో ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడిన గ్లైడ్ కిట్‌లకు భారీ గిరాకీ ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో భారత్ వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. భారత రక్షణ రంగ చరిత్రలో 'టీఏఆర్ఏ ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇది కేవలం యుద్ధ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. ఆర్థికంగా కూడా దేశానికి ఎంతో లాభదాయకమైన ప్రాజెక్ట్. సొంతంగా అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా సరిహద్దులను మరింత భద్రంగా మార్చుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ విజయంతో భారత వైమానిక దళం ఇప్పుడు మరింత కచ్చితత్వంతో, అత్యంత దూరం నుండి శత్రువును వేటాడగల తిరుగులేని శక్తిని సంతరించుకుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి






