డీఎస్పీ భీమ్ రెడ్డి డైరీలో విస్తుపోయే బినామీ ఆస్తుల చిట్టా..!

posted on: Jul 5, 2026 12:18PM

 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు భీమ్ రెడ్డి తన ప్రత్యక్ష, బినామీ ఆస్తులు, వాటికి సంబంధించిన లావాదేవీలు, అప్పులు, అలాగే ఆ వ్యవహారాల గురించి తెలిసిన వ్యక్తులు, మధ్యవర్తుల వివరాలను ఒక డైరీలో నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరీలో తెల్లాపూర్‌లో వాచ్‌మన్ పేరు మీద ఉన్నట్లు ఆరోపణలు ఉన్న రెండు ఫ్లాట్లు, మణికొండలోని లాన్‌కో హిల్స్ రోడ్డులో G+5 వాణిజ్య భవనంలో తన వాటా, గచ్చిబౌలిలోని టెలికాం నగర్‌లో ఉన్న G+2 భవనం వివరాలు నమోదు చేసినట్లు గుర్తించారు. 

అలాగే కర్ణాటకలోని జహీరాబాద్ పరిసరాల్లో 45 ఎకరాల భూమి, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ముచింతల్‌లో 4.2 ఎకరాల భూమి వంటి బినామీ ఆస్తుల వివరాలు కూడా డైరీలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా 'కమ్ బ్యాక్' అనే గమనికతో ఒక వ్యాపారంలో రూ.2 కోట్ల పెట్టుబడి, విల్లా కొనుగోలుకు రూ.60 లక్షలు కేటాయించినట్లు కూడా నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ డైరీ పేజీలను స్కాన్ చేసి తన కుమారులకు వాట్సాప్ ద్వారా పంపించినట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పటికే భీమ్ రెడ్డికి చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, డైరీలో ప్రస్తావించిన బినామీలు, మధ్యవర్తులను త్వరలో విచారణకు పిలిపించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వెస్సెల్లా మెడోస్‌లోని భీమ్ రెడ్డి విల్లాతో పాటు మణికొండలోని అతని వ్యాపార భాగస్వామి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తును మరింత విస్తరించి, కేసులో మరిన్ని అంశాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...