Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..190 మంది పట్టివేత..!
posted on: Jul 5, 2026 6:00PM

వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ పరిధిలో శుక్రవారం, శనివారం రాత్రి ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 190 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరిపై కేసులు నమోదు చేసి, సంబంధిత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో అత్యధికంగా 154 ద్విచక్ర వాహనాలు పట్టుబడగా, 34 కార్లు, రెండు ఆటోలు కూడా సీజ్ చేశారు. పట్టుబడిన వారందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో వాహనం నడపడం కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, అది ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్-105 కింద కేసు నమోదు చేసి, గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, గత వారంలో నమోదైన 376 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులు విచారించి తీర్పులు వెలువరించాయి. ఇందులో 10 మందికి జైలు శిక్ష విధించగా, మరో నలుగురికి సామాజిక సేవ (సోషల్ సర్వీస్) చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. శిక్షలు మరింత కఠినంగా మారుతున్న నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇకపై మరింత విస్తృతంగా కొనసాగుతాయని, ప్రజలు మద్యం సేవించిన తర్వాత స్వయంగా వాహనం నడపకుండా క్యాబ్ లేదా ఇతర ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.






