మునక్కాయలు.. కిడ్నీలో రాళ్లు.. ఈ రెండింటికి సంబంధం తెలుసా?
posted on Apr 25, 2025 9:30AM

మునక్కాయలు వేసవి కాలంలో విరగకాస్తాయి. చాలామందికి మునగ కాయలతో చేసే వంటకాలు అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చూస్తూనే ఉన్నాం. ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యకు మునక్కాయ మంచి పరిష్కారం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో పూర్తీగా తెలుసుకుంటే..
మునగకాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు విచ్చిన్నమవుతాయట. అవి బయటకు వచ్చేస్తాయట. ఈ విషయాన్ని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు మునక్కాయలను ఎడాపెడా తింటున్నారు. మునక్కాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మునక్కాయలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెరుగుపరుస్తుంది. ఇవన్నీ నిజమే కానీ.. మూత్రపిండాలలో రాళ్లను విచ్చిన్నం చేసి వాటిని బయటకు రావడంలో మునక్కాయలు సహాయపడతాయి అనే మాట మాత్రం అస్సలు నిజం కాదని వైద్యులు అంటున్నారు.
మునక్కాయలు మాత్రమే కాదు.. ఏ కూరగాయ కూడా కిడ్నీలో రాళ్లు పోగొట్టడంలో నేరుగా సహాయపడదు అని వైద్యులు అంటున్నారు. మునక్కాయలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే అపోహతో వాటిని ఎక్కువ తింటే అది ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది.
మునగతో లాభం..
మునగ తినడం వల్ల ఖనిజాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. ఇది కొత్త రాళ్ళు ఏర్పడే ప్రక్రియను ఖచ్చితంగా ఆపుతుంది. ఈ కూరగాయలోని యాంటీఆక్సిడెంట్లు, నిర్విషీకరణ లక్షణాలు మూత్రపిండాల నిర్విషీకరణకు, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. మునగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ మునగను తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు పోతాయనే మాట మాత్రం వాస్తవం కాదు. కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా వైద్యులను సంప్రదించడమే మంచిది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...