Latest News

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ.. రెయిడ్ కు వచ్చిన పోలీసులపై కాల్పులు

posted on: Mar 15, 2026 8:31AM

తెలంగాణ రాజకీయ వర్గాల్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ లో శనివారం (మార్చి 14) రాత్రి కాల్పులు కలకలం రేపాయి.   రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో   డ్రగ్స్ పార్టీ జరుగుతోందని  అందిన విశ్వసనీయ సమాచారం  మేరకు   ఈగల్ పోలీస్ ఫోర్స్,  స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటి) ఏకకాలంలో ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టాయి. పార్టీలో పాల్గొంటున్న పలువురు యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులను చూసి ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమిత్ మిశ్రా  తుపాకీతో   కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తరువాత అక్కడున్న పది మందికి డ్రగ్ కిట్‌ ద్వారా పరీక్ష చేయగా పలువురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరింత నిర్ధారణ కోసం రక్త నమూనాలను తీసుకునేందుకు వీరిని ఆస్పత్రికి పంపించారు. ఫామ్‌హౌస్​లో ఆదివారం తెల్లవారు జాము వరకూ తనిఖీలు చేసి మద్యం బాటిళ్లతో పాటు 2గ్రాముల వైట్‌ పౌడర్‌ను సీజ్‌ చేశారు. ఢిల్లీకి చెందిన రియల్టర్  నమీత్​ మిశ్రా కాల్పుల జరిపిన తుపాకీ రితేష్​ రెడ్డిదిగా గుర్తించారు. ఈ పార్టీలో రాజకీయ, వ్యాపార, రియల్​ రంగాలకు చెందిన 10 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.  మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్‌ కుమార్‌, ఢిల్లీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమీత్ మిశ్రా, యం.రమేష్‌, శ్రవణ్‌ కుమార్‌, విజయ్‌ కృష్ణ, రితేష్‌ రెడ్డి, కౌసిక్‌ రవి, అర్జున్‌ రెడ్డి, శర్వీ రెడ్డిలు ఉన్నారని పోలీసులు తెలిపారు. 

ఇలా ఉండగా ఈ ఘటనలో జైపూర్ మాజీ ఎమ్మెల్యే  నితిన్ శర్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, నితిన్ శర్మ శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఫామ్ హౌస్‌కు చేరుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కు రావడానికి కారణమేంటి.? ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ పార్టీ కోసం వచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఇక ఫామ్ హౌస్‌లో ఉన్న వారందరికీ పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో ఫామ్ హౌస్ యజమాని పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అయితే ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో నెగటివ్ రిజల్ట్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.  ఫామ్ హౌస్‌లో సుమారు 20 మంది కోసం వంట ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కానీ అక్కడ జరిగిన పార్టీలో కేవలం 10 మంది మాత్రమే పాల్గొన్నట్లు ప్రాథమికంగా తేలింది. దీంతో మిగతా వ్యక్తులు ఎవరు.? వారు పార్టీలో పాల్గొనలేదా? లేక ఈగల్ టీమ్ రెయిడ్ కు ముందే వెళ్లిపోయారా అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా ఎలా జరిగింది..? పార్టీకి మరెవరు హాజరయ్యారు..? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...