సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్‌ తయారీ కేంద్రం గుట్టురట్టు

posted on: Jun 3, 2026 10:41AM

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం పీచేర్యాగడి తండాలో అక్రమంగా డ్రగ్స్‌ తయారీ చేస్తున్న ముఠా గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు.  రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో రహస్యంగా మెఫెడ్రోన్‌ (ఎండీ) అనే మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు దాడులు చేశాయి.

ఈ దాడుల్లో సుమారు 3 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు డ్రగ్స్‌ తయారీకి ఉపయోగించే రసాయన ముడి పదార్థాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌, రసాయనాల విలువ సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాథమిక విచారణలో డ్రగ్స్‌ తయారీకి అవసరమైన రసాయనాలను ముంబై నుంచి తీసుకువచ్చి ఫామ్‌హౌస్‌లో నిల్వ చేసి..  అక్కడే తయారీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తయారీలో పాల్గొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తదుపరి విచారణ నిమిత్తం మహారాష్ట్రకు తరలించారు.

ఈ డ్రగ్స్‌ తయారీ కేంద్రం వెనుక మరెవరైనా ఉన్నారా? తయారైన డ్రగ్స్‌ను ఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు? ఇతర రాష్ట్రాలతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు  దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్‌ 4న ముంబై సమీపంలోని మీరా రోడ్‌లో 1.324 కిలోల మెఫెడ్రోన్‌ స్వాధీనం చేసుకున్న కేసుతో దర్యాప్తు ప్రారంభమైంది. ఆ కేసులో అరెస్టైన నిందితుల విచారణలో మరికొందరు వ్యక్తుల ప్రమేయం బయటపడింది. వారిని విచారించగా, జహీరాబాద్‌ పరిధిలోని పీచేర్యాగడి తండాలో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తయారీ కేంద్రం నడుస్తున్నట్లు సమాచారం లభించింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి 3 కిలోల డ్రగ్స్‌, రసాయనాలు, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై డ్రగ్స్‌ కేసుతో ప్రారంభమైన దర్యాప్తు చివరకు సంగారెడ్డి జిల్లాలోని ఈ భారీ డ్రగ్స్‌ తయారీ కేంద్రాన్ని వెలుగులోకి తెచ్చింది

google-ad-img
    Related Sigment News
    • Loading...