హీరో రాజశేఖర్ ‘గోటీల ఫ్యాక్టరీ’ గుట్టురట్టు... అసలు నిజం ఇదీ!
posted on: Mar 16, 2026 5:38PM

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్‌కు సంబంధించి ఒక వింత ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు సొంతంగా ‘గోటీల ఫ్యాక్టరీ’ (గోళీల వ్యాపారం) ఉందని, దాని ద్వారా ఆయన కోట్లాది రూపాయలు గడిస్తున్నారంటూ కొన్ని కథనాలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఈ అంశంపై రాజశేఖర్ తో పాటు ఆయన భార్య జీవిత కూడా స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఈ ప్రచారం ప్రకారం.. రాజశేఖర్ నెలకు దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఈ వ్యాపారం ద్వారా సంపాదిస్తున్నారని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని మీమ్స్, వీడియోలు హల్చల్ చేశాయి. కేవలం మీమ్స్‌కే పరిమితం కాకుండా, ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించి రాజశేఖర్ దంపతులు ఫ్యాక్టరీని సందర్శించినట్లు కొన్ని నకిలీ వీడియోలను కూడా సృష్టించారు. ఇది కాస్తా ముదిరిపోయి, నిజంగానే ఆయనకు అటువంటి వ్యాపారం ఉందని అభిమానులు, సామాన్యులు నమ్మే పరిస్థితి వచ్చింది.
తమపై వస్తున్న ఈ వార్తలపై రాజశేఖర్ నవ్వుతూ స్పందించారు. తనకు ఎటువంటి గోటీల ఫ్యాక్టరీ లేదని ఆయన స్పష్టం చేశారు. "ఆ వీడియోలు చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. అంత ఆదాయం వచ్చే ఫ్యాక్టరీ ఎక్కడుందో నాకు కూడా చెప్పండి, నేను వెళ్తాను" అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. తన సన్నిహితులు, స్నేహితులు కూడా ఫోన్ చేసి నిజంగానే వ్యాపారం మొదలుపెట్టావా అని ఆరా తీస్తుండటంతో క్లారిటీ ఇవ్వక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇదే విషయంపై జీవిత రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి సరదా వార్తలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి ఫేక్ వార్తలను నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాజశేఖర్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆయన ఈ రూమర్లపై పూర్తిస్థాయిలో స్పందిస్తూ ‘గోటీల ఫ్యాక్టరీ’ పుకార్లకు చెక్ పెట్టారు. సినిమాల పరంగా బిజీగా ఉన్న రాజశేఖర్, తన పాత పాట 'ఇదేమిటమ్మా మాయ మాయ' మళ్లీ ట్రెండ్ అవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.






