కాగితాలకే పరిమితమవుతోన్న పేదోడి డబుల్‌ బెడ్రూమ్‌ కల

posted on: Mar 16, 2017 12:52PM

తెలంగాణలో పేదోడి డబుల్‌ బెడ్రూమ్‌ ఇంటి కల కలగానే మిగిలిపోతోంది. ప్రతీ పేదవాడికీ రెండు విశాలమైన గదులతోపాటు హాలు, కిచెన్‌తో కలిపి డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్న టీఆర్ఎస్‌ ప్రభుత్వ హామీ కాగితాలకే పరిమితమవుతోంది. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంటూ కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నా... డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం మాత్రం కాగితాలను దాటడం లేదు. డబుల్‌ బెడ్రూమ్‌ నిర్మాణాల కోసం వేల కోట్ల రుణాలను సమకూర్చుకుంటున్న ప్రభుత్వం... పనుల్లో మాత్రం వేగం చూపించడం లేదు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఇప్పటివరకు అంటే 2017 మార్చి 31వరకు 2లక్షల 60వేల డబుల్‌ ఇళ్లను నిర్మించాల్సి ఉండగా, కేవలం 1426 గృహాలు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కూడా ఇప్పటివరకు 964 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా, మరో 462 చివరి దశలో ఉన్నాయి. మిగిలినవి ఇంకా టెండర్ల ప్రక్రియలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. 

 

2017 మార్చి 31వరకు 2లక్షల 60వేల డబుల్‌ ఇళ్లను నిర్మించాల్సి ఉండగా, అందులో 78వేల 996 ఇళ్లను జిల్లాలకు కేటాయించారు, ఇలా జిల్లాలకు అలాట్‌ చేసిన వాటిలో 71వేల 893 ఇళ్లకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. అయితే వీటిలో 1426 ఇళ్ల నిర్మాణం మాత్రమే హౌసింగ్‌ శాఖ చేపట్టింది. మిగిలిన ఇళ్లన్నీ కాగితాల మీదే నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా సిద్దిపేటలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లాలో 16వేల 69 డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం చేపడతామని చెప్పినా... 7212 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే అధికారులు  చర్యలు చేపట్టినా,  అవి కూడా పట్టాలెక్కడం లేదు. ఇదే పరిస్థితి ప్రతి జిల్లాలోనూ ఉంది. 

 

ఇక డబుల్‌ బెడ్రూమ్‌ హామీతోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్‌ఎస్‌... ఆ తర్వాత సమీక్షల పేరుతోనే కాలం సరిపెడుతోంది. గ్రేటర్లో లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం కావాల్సి ఉండగా... ప్రభుత్వం ప్రతిపాదించిన రేటు 7లక్షల 75వేలకు కట్టేందుకు బిల్డర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఇక్కడ పనులు ఒక్క ఇంచు ముందుకు సాగటం లేదు. ఎన్నో సార్లు టెండర్లు పిలిచినా నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదు. దాంతో  గ్రేటర్‌లో పేదోడి డబుల్ బెడ్రూమ్‌ కల... కలగానే మిగిలిపోతోంది. 

 

మొత్తానికి ఈ రెండున్నరేళ్లలో కేవలం 964 కుటుంబాలకు మాత్రమే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ఇవ్వగలిగింది ప్రభుత్వం. అయితే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను  కోట్ల రూపాయల ఖర్చుతో జెట్‌ స్పీడ్‌తో నిర్మిస్తోన్న ప్రభుత్వం.... పేదోడి సొంతింటి కలను సాకారం చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లక్షల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.... కనీసం వందల్లో కూడా కట్టలేకపోతోందని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...