ఇరాన్ సుప్రీం లీడర్‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ?

posted on: Jun 4, 2026 8:51AM

ఇరాన్ తో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆయన ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీతో  నేరుగా భేటీకి సిద్ధమని ప్రకటించారు.   శత్రుత్వంతో, తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సరికొత్త చర్చల అధ్యాయం ప్రారంభానికి ఇది సంకేతమని పరిశీలకులు భావిస్తున్నారు.  ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో నేరుగా భేటీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డొనాల్డ్ ట్రంప్   ఒక ప్రముఖ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.  

పరిస్థితులు అనుకూలించి, సరైన వాతావరణం ఏర్పడితే తామిద్దరం ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కలుసుకుని చర్చలు జరుపుతామని అగ్రరాజ్యాధినేత పేర్కొన్నారు.   ఈ భేటీ ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వాన్ని ముగించడానికి ఒక మైలురాయిగా మారుతుందని శాంతికాముకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో అమెరికా,  ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత అధికార పీఠాన్ని, సుప్రీం లీడర్ బాధ్యతలను ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ స్వీకరించారు. అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. 

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.  ఫిబ్రవరిలో జరిగిన ఆ భీకర దాడుల్లో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని.. అందుకే ఆయన బయటకు రావడం లేదనే ప్రచారం కూడా సాగింది. ఈ మిస్టరీపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో  మొజ్తబా ఖమేనీ క్షేమంగానే ఉన్నారనీ,   వివిధ మధ్యవర్తుల ద్వారా మరియు రాతపూర్వక ఆదేశాల రూపంలో ఇరాన్  పాలనలో చురుగ్గా పాల్గొంటున్నారని   వెల్లడించారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యాధినేత  డొనాల్డ్ ట్రంప్ సైతం ధృవీకరించారు. ఇరాన్ దేశానికి సంబంధించిన కీలక పాలనాపరమైన, వ్యూహాత్మక నిర్ణయాలన్నింటికీ మొజ్తబా ఖమేనీ వెనుక ఉండి ఆమోదం తెలుపుతున్నారన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న కాల్పుల విరమణ  నేపథ్యంలో, తెరవెనుక రాయబారాలు,  శాంతి చర్చల ప్రయత్నాలు జోరందుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు నెమ్మదిగా మెరుగుపడుతున్నాయని   ట్రంప్ అన్నారు. అయితే.. ట్రంప్,  మొజ్తబా ఖమేనీ భేటీ ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...