Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ పవర్ ప్లాంట్లను నేలమట్టం చేస్తాం...ట్రంప్ హెచ్చరిక
posted on: Mar 22, 2026 3:36PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ మొండి వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తక్షణమే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి ట్రంప్ 48 గంటల గడువు విధిస్తూ అల్టిమేటం జారీ చేశారు.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఇరాన్ తక్షణమే ఎటువంటి ఆంక్షలు లేకుండా హార్ముజ్ జలసంధిని తెరవాలి. వచ్చే 48 గంటల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే, అమెరికా సైన్యం ఇరాన్‌లోని ప్రధాన పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తుంది. ముఖ్యంగా ఆ దేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రం నుంచే మా దాడులు మొదలవుతాయి" అని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి.
గత కొద్ది రోజులుగా ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. ఇరాన్ చర్యల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో, అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా గనుక తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడులకు దిగితే, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ సైనిక కమాండర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ ప్రయోగించిన సుదూర శ్రేణి క్షిపణులు ఈ ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నాయి.
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అగ్రరాజ్యం తన యుద్ధ విమానాలను, అపాచీ హెలికాప్టర్లను ఇప్పటికే ఆ ప్రాంతంలో మోహరించింది. డెడ్‌లైన్ ముగిసేలోపు ఇరాన్ తన పంథాను మార్చుకోకపోతే, పశ్చిమాసియాలో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ వంటి దేశాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి.
రాబోయే 48 గంటలు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. ఇరాన్ అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి తలొగ్గి జలసంధిని తెరుస్తుందా? లేక అమెరికాతో నేరుగా ఘర్షణకు దిగుతుందా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పరిస్థితి గనుక విషమిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.



.webp)


