ఎవరైనా పదే పదే బాధిస్తుంటే మౌనంగా ఉంటున్నారా..మీ గురించి మీకే తెలియని నిజాలివి..!

posted on: Aug 21, 2026 3:42PM

అవమానం, బాధ.. ఇవి ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కునేవే.  నిజానికి చాలామంది అవమానం, బాధ అనేవి బాగా దగ్గరైన, ఎంతో ఇష్టపడిన వారి కారణంగానే అనుభవిస్తూ ఉంటారు.  ఇలా అవమానం లేదా బాధ అనేవి ఎదురైనప్పుడు కొందరు గొడవ పడతారు,  మరికొందరు ఎదుటివారిని కూడా బాధపెట్టడానికి ప్రయత్నం చేస్తారు.  ఇంకొందరు అలా బాధపెట్టేవారికి దూరం జరుగుతారు. కానీ కొందరు మాత్రం.. ఇలా బాధ, అవమానం ఎదురైనా సరే.. మౌనంగా ఉండిపోతారు. అసలు తాము ఎందుకు ఇలా చేస్తున్నాం అనే విషయం చాలామందికి అస్సలు తెలియదు కూడా.  ఇలాంటి వారి గురించి వారికే తెలియని షాకింగ్ నిజాలను మనస్తత్వ వేత్తలు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

ఎవరైనా బాధపెడితే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయా?

ఎవరైనా బాధపెడితే.. బహుశా వారు చాలా ఒత్తిడికి గురై ఉంటారు, అందుకే బాధపెట్టారు ఏమో అనుకోవడం.

నన్ను బాధపెట్టాలని అనుకోలేదు ఏదో ఆవేశంలో అలా చేసి ఉంటారు అనుకోవడం.

ప్రస్తుతం వారి జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, పాపం ఆ టెన్షన్ లో నన్ను బాధపెట్టి ఉంటారు అనుకోవడం.

పై కారణాల వల్ల  బాధపెట్టే వారిని సమర్థించుకుంటూ,  వెనుకేసుకొస్తూ, వారిని మంచోళ్లుగా చూస్తూనే ఉంటారు.

ఎందుకిలా జరుగుతుంది?

సంఘర్షణ భయం..

ఎవరైనా తమతో సరిగా ప్రవర్తించకపోతే.. ఆ విషయం  తెలిశాక, వాదనలు లేదా గొడవలు నివారించడానికి.. జరిగిన వాటి గురించి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతూ ఉంటారు. చాలా మంది గొడవ  అనే ఆలోచనకే ఒత్తిడికి లేదా అసౌకర్యానికి గురవుతారు. అది సంబంధాన్ని నాశనం చేస్తుందేమోనని భయపడతారు. అందుకే మౌనంగా ఉండిపోతారు.

ప్రాధాన్యత..  

కొన్నిసార్లు బెస్ట్ గా ఉన్నది మనకు దక్కేంత అర్హత మనకు లేదని భావించి, తక్కువకే సర్దుకుపోతూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని పదేపదే బాధపెడుతున్నా లేదా వారి హద్దులు దాటుతున్నా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ముఖ్యం.

గాయం  ప్రేమకు దారితీస్తుందని అనుకోవడం..

చాలా మంది బాధపడిన తర్వాత కూడా, తాత్కాలిక ప్రేమను లేదా శ్రద్ధను చూపిస్తారు. ఈ ఎమోషనల్ గొడవ గందరగోళాన్ని సృష్టిస్తుంది.  దీనిని ట్రామా బాండింగ్ అని అంటారు. దీని కారణంగా, మనల్ని పదేపదే బాధపెట్టే వారిని వదిలిపెట్టడానికి  ఇబ్బంది పడతాము.

 మార్పు  ఆశించడం..

ఎప్పటికైనా బాధపెట్టే  వ్యక్తి మారుతాడని  నమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న మార్పులు కూడా మన ఆశను పెంచుతాయి. కానీ వాస్తవం ఏమిటంటే, ఈ మార్పు శాశ్వతం కాదు,  మనం మన జీవితంలోని ఎన్నో సంవత్సరాలను కోల్పోవాల్సి రావచ్చు కూడా.

పెంపకం ప్రభావం..

క్షమించడం, విశాల హృదయం కలిగి ఉండటం, మనకంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైనవని నూరిపోస్తూ  పెంచడమే ఇలా ఎవరైనా బాధపెట్టినా కూడా మౌనంగా ఉండిపోవడానికి కారణం. సంబంధాలలో శాంతి, సామరస్యాలను కాపాడుకోవడం మన ఏకైక బాధ్యత అని  నమ్మడం వల్లే ఇలా చేస్తారు.

ఒంటరిగా ఉండాలనే భయం..

ఒక చెడ్డ సంబంధంలో బాధపడటం కంటే ఒంటరిగా ఉండటమే మేలైనప్పటికీ, ఒంటరిగా ఉండటానికి భయపడి..  ఎదుటివారు బాధిస్తున్నా సరే.. కలిసి ఆ బంధంలోనే ఉండాలని అనుకుంటూ ఉంటారు.

బాధపెట్టే వారితో ఎలా ఉండాలి..

బాధపెట్టే  వారి మాటలను మనసుకు తీసుకోకూడదు. ఎవరైనా బాధపెట్టినప్పుడు గొడవ జరగకుండా ఉండాలంటే ఆ ప్రదేశాన్ని వదిసి దూరంగా వెళ్లవచ్చు.
.
మార్పును బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించకూడదు.  నమ్మకమైన వారితో మాట్లాడటం  లేదా థెరపిస్ట్ సహాయం తీసుకోవడం మంచిది.  ఇతరుల ప్రాధాన్యత ఇవ్వడం కంటే.. తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోవడం పట్ల శ్రద్ద పెట్టడం మంచిది.

                                                                                                                                                  *రూపశ్రీ.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...