Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భార్యకు వంట రాదని విడాకులు కోరిన భర్త...కోర్టు సంచలన తీర్పు!
posted on: May 26, 2026 4:10PM

ఇటీవల కాలంలో సమాజంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, అంతే వేగంగా చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్తున్నాయి. తీవ్రంగా పరిగణించాల్సిన సమస్యలేవీ లేకపోయినా, కేవలం అహంకారం, చిన్నపాటి మనస్పర్థలకే కోర్టు మెట్లు ఎక్కి విడిపోతున్న జంటలు కోకొల్లలు. అయితే ఇక్కడ ఒక కేసులో అలాంటి వింతే చోటు చేసుకుంది.
కేవలం తన భార్యకు వంట చేయడం రాదని, ఇంటి పనులు సరిగ్గా చేయడం లేదని ఒక భర్త ఏకంగా విడాకులు ఇవ్వమంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆ భర్తకు దిమ్మతిరిగే సమాధానం ఇస్తూ, చివాట్లు పెట్టింది. సమాజంలో వివాహ బంధానికి ఉండే ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఈ కథలోకి వెళ్తే.. సదరు దంపతులకు 2002 లో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే వారి మధ్య వివాదాలు మొదలయ్యాయి. అదే సంవత్సరం (2002) లో ఆ భర్త తన భార్యపై "మానసిక క్రూరత్వం" అనే కారణాన్ని చూపిస్తూ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
తన భార్యకు అస్సలు వంట చేయడం రాదని, ఆమె చాలా మొరటుగా ప్రవర్తిస్తూ, తన మాట వినకుండా ఉంటుందని ఆరోపించాడు. అంతేకాకుండా ఇంటి పనులను కూడా సరిగ్గా చేయలేదని, దీనివల్ల తనకు తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగిందని వాదించాడు. వైవాహిక చట్టం ప్రకారం భార్య చేసే ఇటువంటి పనులు మానసిక క్రూరత్వం కిందకే వస్తాయని అతడు కోర్టులో వాదించడం గమనార్హం.
అయితే ఈ ఆరోపణలన్నింటినీ భార్య తీవ్రంగా ఖండించింది. వాస్తవానికి, ఇంట్లోని పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం వంటి అన్ని రకాల కష్టమైన ఇంటి పనులను తనతోనే బలవంతంగా చేయించారని ఆమె వాపోయింది. అంతటితో ఆగకుండా, ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని కూడా తనకే పెట్టి, తినమని బలవంతం చేస్తూ తనను మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె కోర్టుకు తెలిపింది.
అయితే ఈ వివాదంలో గతంలో ఫ్యామిలీ కోర్టు 2010 లో ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. భార్య ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తరగతుల కోసం ఇచ్చిన ఒక ప్రకటన ఆధారంగా ఆమె స్వతంత్రంగా సంపాదించుకోగలదని నిర్థారించింది. దాంతో ఆమెకు భరణం నిరాకరిస్తూ, భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఈ అన్యాయమైన తీర్పును సవాలు చేస్తూ బాధితురాలైన భార్య ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ భారతి డాంగ్రే మరియు జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ సుదీర్ఘంగా విచారించింది. విచారణ అనంతరం ధర్మాసనం భార్యకు అనుకూలంగా అద్భుతమైన తీర్పునిచ్చింది.
పెళ్లి అనేది సమానుల భాగస్వామ్యం అని, అంతేగాని అది ఒక సేవా ఒప్పందం కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పనిమనిషిలాగా పరిగణించకూడదని గట్టిగా హెచ్చరించారు. వంట చేయడం లేదా ఇల్లు శుభ్రపరచడం వంటి పనులు చేయడంలో విఫలమైనంత మాత్రాన, దానిని చట్టపరంగా మానసిక క్రూరత్వంగా భావించలేమని తేల్చి చెప్పారు.
పెళ్లయిన తొలినాళ్లలో దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న అభిప్రాయ భేదాలను ఒకరినొకరు సర్దుబాటు చేసుకునే ధోరణిలో చూడాలి తప్ప, వాటిని క్రూరత్వపు ఆరోపణల కిందకు తీసుకురాకూడదని ధర్మాసనం మండిపడింది. చిన్న తరహా కార్యకలాపాలను లేదా హాబీలను మహిళల శాశ్వత ఆదాయానికి రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన పాత తీర్పును పూర్తిగా కొట్టివేసింది.
అలాగే విడాకుల కేసులలో చట్టపరంగా మానసిక క్రూరత్వం అంటే ఏమిటో కూడా ధర్మాసనం వివరించింది. క్రూరత్వంలో అవమానం, భావోద్వేగ బాధ కలిగించే లేదా వివాహాన్ని కొనసాగించడం అసాధ్యం చేసే తీవ్రమైన ప్రవర్తన ఉండాలని పేర్కొంటూ గతంలో మంజూరైన విడాకులను రద్దు చేసింది. అంతేకాకుండా, సదరు భర్త తన భార్యకు ప్రతి నెలా రూ. 20,000 ల భరణం చెల్లించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.






