గురువులను కూడా వదిలిపెట్టడు అతను?
posted on Sep 5, 2015 3:53PM
.jpg)
మరే దేశంలోను చెప్పని విధంగా మన దేశంలో మాత్రమే ‘మాతృదేవో భవ, పితృదేవో భవ’ అని చెప్పిన తరువాత ‘ఆచార్య దేవో భవ’ అని చెపుతుంటారు. అంటే తల్లి తండ్రుల తరువాత స్థానం గురువుదేనని అర్ధం అవుతోంది. పిల్లలకి ఈ సువిశాల ప్రపంచాన్ని పరిచయం చేసే వ్యక్తి గురువు. వారి ఉజ్వలమయిన జీవితాలకు బాటలు పరిచే మహనీయుడు గురువు. అందుకే గురువుకి అంత ప్రాధాన్యం, గౌరవం ఇస్తుంటారు.
మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం తన చివరి క్షణం వరకు కూడా పిల్లలకు పాఠాలు చెపుతూ కన్ను మూసి గురువుగా తన జన్మచరితార్ధం చేసుకొన్నారు. దేశంలో కెల్లా అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ అంతటివ్యక్తి, ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా కళాశాలలో పిల్లలకి పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చారంటే రాష్ట్రపతి కంటే గురువే గొప్పవారని ఆయన కూడా భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది. నేడు దేశ వ్యాప్తంగా పిల్లలు,పెద్దలు అందరూ తమ గురువులను స్మరించుకొని, సన్మానించుకొంటున్నారు.
కానీ ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరొకదారి అనే నానుడి బహుశః దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళవంటి వల్లనే ఏర్పడిందేమో? ఆయన దేవుళ్ళని వదిలి పెట్టలేదు చివరికి గురువులను కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ ఎప్పటి లాగే గురువు గురించి కూడా కొన్ని వంకర మాటలు పలికారు. “నేను నా జీవితంలో ఒక్కరోజు కూడా నా గురువుల వలన సంతోషంగా లేను. కనుక నేను ‘హ్యాపీ టీచర్స్ డే’ అని వారిని అభినందించలేను” అని ట్వీట్ మెసేజ్ పెట్టారు. ఇటువంటి వ్యక్తిని ఏమనాలి?